naa earukalo krishnatatvam
- Balatripura Sundari Venugopal

- Sep 19, 2021
- 3 min read
నా ఎరుకలో కృష్ణతత్వము
ఎదలు పొంగి యమునలైన మా.. జీవితమే కృష్ణ సంగీతమూ.. సరిసరి నటనలు స్వరమధురిమలు
అంతరంగాన ఊగే రస తరంగాల తేలే యమునా నదీ లహరికా నాట్య గీతమూ..జీవితమే కృష్ణ సంగీతమూ..
అల్లిబిల్లి పిల్లంగోవి పాటకాడే, గానాల తేనెలు చిందువాడే, కనువిందువాడే, మైమరపించే మాటకాడే అర విరిసే చిరునవ్వులవాడే (మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు).
కృష్ణుడి గురించి రాసే సామర్ధ్యం కాని, పరిజ్ఞానము కాని నాకు లేవు. ఇది మోము పొత్తంలో మా అన్నయ్య పతంజలి శర్మ గారు రాస్తున్న ధారావాహిక భాగవతం చదివి, ప్రేరణ పొంది, నాకు అర్థమైనంతవరకు కృష్ణుడి గురించి మీతో పంచుకోవాలని రాస్తున్న ఒక కృష్ణ భావ వీచిక మాత్రమే. “కృష్ణా” అంటేనే మన మనసులో ఎన్నెన్నో భావాలు మెదులుతాయి. కృష్ణా నీ పేరు తలచినా చాలు మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు అందుకే అన్నారు కామోసు డాక్టర్ నారాయణ రెడ్డిగారు.
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది.
జీవితాన్నిరసభరితంగా మలుచుకుంటూనే, స్థితప్రజ్ఞతని అంతర్లీనంగా ఎలా వంటబట్టించుకోవాలో మనందరమూ కృష్ణుడిని నుంచి నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన విషయం. కృష్ణుడి జీవితం పుట్టిన దగ్గర నుంచి అవతార సమాప్తి వరకు అనేక అనుభవాల సారం. సునిశిత పరీశీలన, చెప్పింది చేసే గుణము, సమయానుకూలంగా తన తీరుని మార్చుకోగల వైఖరి, విశ్వజననీయమైన ప్రేమతత్త్వం, స్త్రీల పట్ల చూపిన ఆదరణ, గౌరవం, సున్నితత్త్వం, తామరాకు మీద నీటి చుక్కలా జీవించే అత్యంత నేర్పు, అందరిలో పుట్టి అందరిలో చేరి అందరి రూపము లటుతానై ఉన్నటువంటిదే కృష్ణ తత్త్వం. ఆయన తత్త్వం లవలేశమైన ఒంటబట్టిన వారికి జీవితము, వేటూరి సుందరామ్మూర్తి గారు నుడివినట్టుగా నిజంగా కృష్ణ సంగీతమే.
చూచితిరొ లేదొ చిన్నికృష్ణుని సొబంగు
పెదవి చివురు నంజల నరవిచ్చు నవ్వు
వెన్నెల, చలించు తుమ్మెద బెళుకు చూపు
లోలపవనచాలిత కుటిలాలకమ్ము
తరళచూడాకలాపమ్ము మురళి గూడి
యల్ల నల్లన గొంతెత్తి యమృతగాన
శీతల తుషారముల విరజిమ్ము వేళ
జిన్నికృష్ణుని సొబగు
(దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అన్వేషణము)
ఎక్కడిదీ అందం? ఎవ్వరిదీ ఆనందం? వెలిగే అందం చెలరేగే ఆనందం. వెన్నెల దీవల్లె అందాలు మావి, ఆనందాలు మావి.
నవమల్లిక చినవోయెను చిరునవ్వు సొగసులో చిలిపితనానికి చిరునామా అయిన కృష్ణుడి పసిపాపడి లాంటి అమాయకమైన స్వభావం, కల్మషం లేని ప్రేమ, మార్దవము మనకు కన్నయ్యను ఎంతో దగ్గర చేస్తాయి, మనలోని అమ్మదనాన్ని, ఆడతనాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. కన్నయ్య నవ్వు మన అందరిని ఆనంద పారవశ్యంలో ముంచే సమ్మోహనాస్త్రం.
శ్రీ భాగవతములో వ్యాసులవారు ఋతువర్ణన ఘట్టములో అందుకేనేమో ఆ శ్యామాలాంగుడి చిరునవ్వుని “కృష్ణమేఘాన్ని వెన్నాడుతూ వచ్చే మెరుపు తీవ” (మేఘాన్ని కృష్ణుడి మేని రంగుతో పోలుస్తూ)అని ఎంతో రమ్యంగా భావన చేశారు.
“ఒఱపో మెఱుపో వొయ్యారమో నీకు వెఱతుమయ్య గోవిందుడా, కపటమో నిజమో కరుణయో కోపమో వుపచారమో వుపతాపమో నిపుణత తనపై నెయ్యమే సేసేవు విపరీతము గోవిందుడా!” (అన్నమయ్య)
వెన్నెల రుచి కన్న వెన్నల చవి మిన్న అన్నన్నా ఇది ఏమి అల్లరిరా……
వెన్ను(డు గురించి వేదాంతులు ఎంత చక్కటి భాష్యాన్ని చెప్పారో చూడండి - తెల్లని వెన్న జ్ఞానానికి, వెన్నను దాచే కుండ మనలో ఉన్నఅజ్ఞత అనే చీకటి: నవనీతచోరుడు మనలో ఉన్న మాయ అనే ఆ చీకటిని దొంగిలించి జ్ఞానమనే కాంతిని ప్రసాదించే పరంజ్యోతి.
చేరి కానరానివాడు – చింతిచరానివాడు, భారపు వికారాల( బాపినవాడని సారము దెలియుటే సత్యం జ్ఞానము
అల నీలిగగనాల వెలిగే నీ రూపు, ఆనందభాష్పాల నిండే నా చూపు….
పగటివేళ నీలంగాను, రాత్రివేళ నల్లగానూ కనిపించే ఆకాశం, సూర్యుడు ఉదయించినప్పుడు ఒక రంగులోనూ, అస్తమించినప్పుడు ఒక రంగులోనూ కనిపిస్తుంది. అల్లాగే శుక్ల పక్షం, కృష్ణపక్షం (బహుళ ) రోజులలో చంద్రుడి రాకను బట్టి ఆకాశం తన రంగుని మార్చుకుంటుంది కృష్ణుడి మేని ఛాయను పోలినట్టుగా. ఇవన్నీ కాలానికి సంకేతాలు, కృష్ణుడే స్థితికారుడు అనడానికి నిదర్శనాలు. నీలమై నిఖిలమయ్యి కాలమై నిలిచాడే…..
వేణువు నూదరా మాధవా, వెన్నెల విరియునురా దేవా
కప్పురంపు చలువ,
కన్నెగేదకి తావి,
పుట్ట తేనె తీపి మురళి రవళి
గానమే కామనమని, జీవనమని కలవరించు పిల్లనగ్రోవి పాటకాడు కృష్ణుడు. వేణువుని కేవలం ఒక వెదురు కొమ్మ అనుకుంటే అంతకన్నా పొరపాటు ఉండదు. కన్నయ్య మోవిని ఆశ్రయించిన వేణువు ఆత్మార్పణానికి ప్రతీక. వేణువులో తనదంటూ ఏమీ లేదు, అంతా శూన్యం. శూన్యం పరిపూర్ణతకు గురుతు. శూన్యమైన ఆ వేణువులో కృష్ణ స్వరం కలిసింది. తనను తాను అర్పణం చేసుకుని వేణువు ఆ దేవదేవుడిలో లయించిపోయింది. నిష్కామంగా అలా తనను చేరిన ఆ వేణువును కన్నయ్య ఎంతగా అభిమానించాడంటే వేణుమాధవుడుగా తన పేరును మార్చుకున్నంతగా. కృష్ణుడే వేణువు, వేణువే కృష్ణుడు.
విన్నారా..అలనాటి వేణుగానం మోగింది మరల, చెలరేగే మురళీ సుధలు, వినిపించెను కృష్ణుని కథలు.
వేణువు నుంచి మనం నేర్చుకోవలసినది ఒక్కటే. నేను నాది అనేది ఏది లేకుండా అహంకార మమకారాలను వదిలి స్వచ్ఛమైన మనసుతో ఆ నల్లనయ్యను కొలిస్తే, అమ్మ మనలను తన ఒడిలోకి తీసుకున్నట్టే ఆదరముగా, తన అక్కున చేర్చుకుంటాడు.
జోహారు శిఖిపింఛ మౌళి.
భూమి మీద ఉన్న అనేక వేల జీవరాశులలో నట్టు పులుగు జాతి మాత్రమే ఎటువంటి సంయోగం లేకుండా తన జాతిని వృద్ధి చేసుకుంటుంది. కారుమబ్బులతో నిండిన ఆకాశాన్ని చూసిన వర్షామాదము ఆనందాతిశయంతో, ప్రకృతిలోని వివిధ వర్ణాల సమ్మేళనానికి మచ్చుతునక ఐన, తన పురివిప్పి నర్తనమాడేవేళ, దాని కంటి నుండి రాలిన నీటిచుక్కలను మాత్రమే గ్రహించి ఆడునెమలి గ్రుడ్లు పెడుతుంది. అందుకే నెమలి పింఛమును పవిత్రతకు మారుపేరుగాను, భగవదంశగానూ భావిస్తారు. నెమలిపింఛము పవిత్రతను గుర్తించిన యోగేశ్వరుడైన కృష్ణుడు దానిని శిరోభూషణంగా స్వీకరించాడు. గోపికవల్లభుఁడైనా, నారీ మానస చోరుడిగా ముద్ర పడినా, కృష్ణుడు రాగమోహాలకి అతీతుడు. నెమలి పింఛంలో ఉన్న నాలుగు వలయాలు తమో, రజో, సత్వ గుణాల మధ్య ఆత్మసాక్షిగా గోచరించే కృష్ణుడి పరమయోగ తత్వాన్ని సూచిస్తున్నాయి.
పరమపురుష నిను నమ్మినవారిని దరికి సరసముగా చేరదీసి, కయ్యామో వియ్యమో తెలియని తీరుగ కవ్వించి నవ్వించి గారడీ చేసేవు. ఎంతటి ఘనుడవు, ఎంత వంతకారివి. అంతు చిక్కదయ్యా నీ లీలకు.
Comments