top of page
Search

అష్టవిధ నాయికలు - దేవులపల్లి – బాపు

  • Writer: Balatripura Sundari Venugopal
    Balatripura Sundari Venugopal
  • Apr 2, 2024
  • 6 min read

ఈ మధ్య రా రా పెనిమిటి అనే తెలుగు సినిమాను చూడడం తటస్తించింది. అందులో కథానాయిక మినహా మనకు వేరే ఏ పాత్ర కనపడదు; వినపడుతుంది కాని. ఆ సినిమా కథ పెళ్లయిన వెంటనే పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తన భర్త గురించి ఆ అమ్మాయి అనుభవించిన విరహము గురించి. అది చూస్తుంటే మన ప్రబంధాలలో వర్ణించిన అష్టవిధ నాయికలు స్మరణకు వచ్చారు.

అష్టవిధ నాయికల ప్రస్తావన మొట్టమొదట భరతముని వ్రాసిన నాట్యశాస్త్రములో కనిపిస్తుంది. క్రమంగా శిల్ప, చిత్ర కళలలోను, సాహిత్యంలోను, అష్టవిధ నాయికల భంగిమలు, వర్ణనలు చోటు చేసుకున్నాయి. మాకు తెలుగు బోధించిన ఆచార్యవరుల ధర్మమా అని తెలుగు సాహిత్యప్రక్రియలలో ప్రబంధ రచనకి ఒక ప్రత్యేకమైన స్థానము ఉందని తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రబంధాల ప్రయోజనము లక్షణ బేధాలను బట్టి నాయికానాయకుల వర్ణన, శృంగారము, కరుణ వంటి మనోభావనలకు పెద్ద పీట వేస్తూ కావ్యరచనలను చేయడం అని అర్థమైంది. అష్టవిధ నాయికల గురించి కొంచం కుతూహలము కలిగింది.

అదే సమయములో వచ్చిన మహాకవి క్షేత్రయ్య అనే సినిమాలో (1976) డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు అష్టవిధ నాయికలను వర్ణిస్తూ, రచించిన ‘మేలుకో కవి రాజా…’ అనే పాటను విని, వాటికి బాపు గారు బొమ్మలు వేస్తే ఎలా ఉంటుంది అని మా మిత్ర బృందం అనుకునేవారం. తరువాత దానిని గురించి మర్చేపోయాను.

మళ్లీ ఇన్నాళ్లకు ఆ ఆలోచన బయలుదేరింది. దేవులపల్లి వారు రాధా కృష్ణుల ప్రణయాన్ని గురించి వ్రాస్తూ, విరహణి రాధను ఈ అష్టవిధ నాయికలతో పోల్చారని వ్రాసినట్టు ఎక్కడో చదివినట్టుగా లీలగా గుర్తు. ఇటీవల బాపు గారి జన్మదిన సందర్భములో ఆయన గురించి వ్రాద్దామని పుస్తకాలు తిరగేస్తుంటే, వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు, తెనాలి ప్రచురణలు వారి బాపు అనే పుస్తకంలో దేవులపల్లి వారి అష్టవిధనాయికల పద్యాలకు బాపు గారు గీసిన అమూల్యమైన బొమ్మలు కనిపించాయి. కాని ఇందులో ఏడుగురు నాయికల వర్ణనలు మాత్రమే బాపు బొమ్మలతో ఉన్నాయి. అందులోలేని ఎనిమిదవ పద్యం కోసం కృష్ణశాస్త్రిగారి పద్య సంకలనాలను వెతికితే, బదరికఅనే కావ్యములో శృంగార నాయికలు అనే శీర్షిక క్రింద ఈ పద్యాలు కనిపించాయి. బాపు గారు ఎప్పుడు ఈ పద్యాలకు అ బొమ్మలు గీసారో నాకు తెలియలేదు. ఏడుగురు నాయికల పద్యాలు వాటి కోసం బాపు గీసిన బొమ్మలతో పాటు ఒక్క అభిసారిక అనే పద్యానికి మాత్రం వారు గీసిందే వెన్నెల వేడెక్కనే అనే చిత్రాన్నితీసుకున్నాను.

రచన గొప్పా? బొమ్మ గొప్పా? అనే విచికిత్సలో పడకుండా భావనను బట్టి భంగిమ, భంగిమను బట్టి భావన అనుకుని మీ ముందుకు వచ్చాను. మహానుభావులైన వీరిద్దరూ సృష్టించిన ఈ కళాసంపద మనకే దక్కిన గొప్ప పెన్నిధి. అందుకే వారిరువురి స్మృతికి మరొక్కసారి నమస్సుమాంజలులు అర్పిస్తూ

రోజుకొక్క వర్ణనతో బొమ్మతో మీ ముందు ఉంటాను. సుందరి వేణుగోపాల్

 


స్వాధీనపతిక  భర్తను తన  స్వాధీనములో  ఉంచుకుని, తన కనుసంజ్ఞలలోనే  అతను నడిచేటట్టుగా చేసుకునే చాతుర్యం కల ఇంతి.

ఇరులలో తారక లివి యంచు, తానె నా

కురులలో మల్లియ విరులు తురుము!

అసలె కెందమ్ము లీ అడుగు లనుచు, ఎంతొ

పొందుగా  లత్తుక  పూయు తానె!

అది యేదొ అంటె నీ అధరాన నని, తన

మెత్తని పెదవుల నొత్తి తుడుచు!

చూచుచు, మరి మరి మెచ్చుచు, మక

రికల చెక్కిళ్ల చిత్రించు తానె!

ఎంత పున్నెమ్ము చేసినానే, మగండు

ఒక్క క్రీగంటి చూపులో, ఒక్క లేత

నగవులో, నా మనస్సు నెరిగి, గ్రహించి,

తీర్చునే యంచు, మురియు, స్వాధీనపతిక.

ఈ పద్యంలో భర్త తనకు చేసిన అలంకారాలను గురించి ఎంతో మురిపంగా చెలితో వివరిస్తున్నది. తన తలలో తురిమిన మల్లెపూలు చీకటిలో మెరుస్తున్న నక్షత్రాలంటూ, పాదాలకు పారాణిగా పొందికగా పూసిన  లత్తుక ఎఱ్ఱతామరవంటి తన అడుగులేనంటూ, తననే చూస్తూ మేను మరిచి మరీమరీ చూస్తూ బుగ్గలపై లత్తుకతో మకరిక చిత్రాలను ఉల్లేఖిస్తాడుట. తన ఒక్క క్రీగంటి చూపుతో, ఒక్క చిన్నినవ్వుతో   తన మనసును తెలుసుకుని, ఏమి కావాలో గ్రహించి నెరవేర్చే భర్తను పొందిన తాను ఎంతో అదృష్టవంతురాలినని మురిసిపోయే పత్ని నిజంగా స్వాధీనపతిక.


వాసకసజ్జ భర్త రాకకు కోసం  తన ఇంటిని ఒంటిని చక్కగా అలంకరించుకుని ఎదురుచూసే జవ్వని

పవళింపు గదిలోన, పగడంపు  కోళ్ల చ

ప్పరపు మంచముపైన  పాన్పుపైన

వలిపంపు జిలుగు  దుప్పటి వేసి, కస్తూరి

జవ్వాది కలిపిన గంధసార,

మగరువత్తులు, మేలి అత్తరుల్, పచ్చ క

ప్పురపు వీడియము పళ్ళెరమున నిడి

ద్వారాన తోరణాల్ కూరిచి, ముంగిట

వన్నెవన్నెల రంగవల్లులుంచి

తానమాడి , పుప్పొళ్ల  నెమ్మేన నలది

నెరుల సిగ నల్లి, నుదుట చెందిరపు బొట్టు,

కనుల కాటుక అలతి నగవులు మెరయ

విభుని కొరకు వాసకసజ్జ వేచియుండు.

ఈ పద్యములో తన భర్తకు కంటికింపుగా, మనసుకు హాయిని కలిగించేటట్టుగా భార్య చేసుకునే సింగారాన్ని, గృహాలంకరణను రమ్యంగా చెప్పడము జరిగింది. ఆ రమ్యతకు వన్నెలు అద్దినట్టుగా గీతలు అమిరాయి. ఇంటిముందు అందమైన రంగవల్లులను తీర్చదిద్ది, గుమ్మాలకు తోరణములను కట్టి, పడక గదిలోని పందిరి మంచపు పాన్పుపైన మృదువైన చలువ దుప్పటిని పరచి, కస్తూరి, జవ్వాది, మంచి గంధము, అగరవత్తులు వంటి సుగంధ ద్రవ్యాలను, పచ్చ కర్పూరపు తాంబూలమును పళ్ళెములో సిద్ధంగా ఉంచి; స్నానము చేసి, పుప్పొడిని వొడలంతా వ్రాసుకుని, కురులను ముడివైచుకుని, నుదుట కుంకుమను, కనుల కాటుకను దిద్దుకుని చిరునవ్వులను చిందిస్తూ ప్రాణపతి రాకకై వేయికనులతో వేచే ఎలనాగ వాసకసజ్జ /సజ్జిక


విరహోత్కంఠిత ప్రియుడి ఎడబాటు ఎంతమాత్రం ఓపలేని జవరాలు.

విభుని దోతేర పంపిన ప్రియదూతిక

లెంతకు తిరిగిరారేమొకాని -

ఘనుల సధ్గోష్ఠిలో మునిగి యున్నాడని

వెరతురేమో స్వామి దరియుటకును;

నిప్పుల వర్షమై నిలువెల్ల దహియించు

నిలబడనీదు వెన్నెలల వాన;

అయ్యయో, మదనదేవా! మ్రొక్కుదాన, నా

పైననా ననతూపుపదనుబాకు?

అతనుడవు, నీవు పోగల వటకు, - వారి

ఉల్లమున జేరి నా మాట నూదగలవు;

చనుము- నా ప్రాణముల నిల్పు మని నెలంత

తల్లడిలు విరహోత్కంఠిత  వలవంత

ఈ పద్యములో క్షణమైనా తన ప్రియుడిని వదిలి ఉండలేని ముద్దరాలు పడే విరహ వేదనను కనులకు కట్టినట్టుగా వర్ణించారు. చిత్రములో మేఘాలు, మెరుపులు, క్రిందనే నీళ్లు పారుతున్నట్టుగా గీతలు, చలిస్తున్న లేడి, చెట్టుకు చుట్టుకున్న పూలమాల మన్మధ బాణాలకు గురియైన ప్రియురాలి శారీరిక స్థితి మనకు బృందావనంలో కృష్ణుడి కోసం వేచియున్న విరహిణి రాధను తలపింపచేస్తున్నాయి. 

అయ్యో వారిని దగ్గరుండి స్వయంగా తీసుకు రమ్మని పంపిన నా దూతికలు ఎంతకూ రారేమిటి ? వారు గొప్పవారితో చర్చలలో మునిగి ఉన్నారని సంకోచంతో దగ్గరకు వెళ్ళడానికి వెనకాడుతున్నారేమో ? ఓ మన్మధా  అసలే వానలా కురుస్తున్న  ఈ వెన్నెల అగ్నిలా నన్ను నిలువెల్లా దహించివేస్తుంటే, పదునైన నీ పూలబాణాలతో నన్ను మరింత బాధపెట్టడం సరి కాదు. నీకు దండం పెడతాను. అనంగుడివైన నువ్వు అతని దగ్గరకు  (ఎవరూ నిన్ను చూడలేరు అని కాబోసు)వెళ్లి అతనికి నా సందేశాన్ని చేరవేసి నా ప్రాణాలను కాపాడు అంటూ తీవ్రమైన మదన తాపముతో రగిలిపోతున్న చిగురుబోడి విరహోత్కంఠిత.


విప్రలబ్ధ సంకేతస్థలానికి  రమ్మనమని ప్రియుడు పిలవగా వెళ్లి అతను  రానందున  విరహముతో  వేగిపోయే  విరిబోడి

ఈ తీవ యోవరియే గదా తాముర

మ్మన్నయేకాంత గృహమ్ము! తాము

మెత్తురనే గదా, మెలత, ఈ కయిసేత!

ఈ నిరీక్షణము  లింకెంతసేపె?

కడచెనే రేయిసగ; మ్మైన శ్రీవారి

అడుగుల సడియును పడదు చెవుల-

మరిమరి పొగడకే మాయలమారిని

విసిగిన ప్రాణాలు వేపి తినకె!

పదవె అడుసాయె  నేల నా బాష్పవారి

ననుచు  నెవ్వగ మెయినగ లన్ని ఊడ్చు;

“అసలు దోసము నాదే” నటంచు  ఏడ్చు,

విరహమున వేగిపోయిన విప్రలబ్ధ.

ఈ పద్యములో ప్రియుని కలవడానికి అతను రమ్మనమన్న చోటుకి వెళ్లి అతనిని కానక,  ఆ జాగును భరించలేక, విరహముతో  కుమిలిపోయే ప్రియురాలి పడే బాధను వర్ణించడము జరిగింది. బాపుగారి బొమ్మలో ఆమె వేదన, కోపంతో తన నగలను ఊడపీకి నేలపై విసిరికొట్టడము ఆమె అవస్థను కన్నులు కట్టినట్టుగా ఉంది.

ప్రియుడు రమ్మనందునే కదా యేకాంత గృహానికి వచ్చింది. అతనికోసమే కదా ఈ అలంకరణ చేసుకున్నది. ఇంకా ఎంతసేపు ఈ ఎదురుచూపులు? రాత్రిలో సగం ఇలానే గడిచిపోయింది. అయినా అతని అడుగుల సడి వినపడదు. ఆ మాయలమారిని ఎందుకు అంతగా పొగుడుతావు? అసలే విసిగి ఉన్న నన్ను మరింత వేధించకే.ఇక వెడదాము  పద. నా కన్నీటి ధారలతో ఈ దారి అంతా తడిసిపోయి చిత్తడి అయ్యింది అంటూ చెలితో చెపుతూ విరహాన్ని తాళలేక పట్టరాని కోపంతో ఒంటిమీదున్న నగలను విసిరివేస్తూ వివశయైన వలజ విప్రలబ్ద.


ఖండిత రేయంతా వేరే ఇంతితో గడిపి, ఆ చిహ్నాలతో వచ్చిన ప్రియుడిని చూసి ఆవేశంతో రగిలిపోయే రమణి.

విన్నవే యిన్నాళ్లు, కన్ను లారగ  చూసి

నాను, నే డెంతొ  ఆనంద  మాయె;

ఆ చందనాంకము, లా తమ్ములపు ముద్ర

లే లేమవో చెప్పలేరు  తామె;

వేయికి పైనాయె ప్రియురాండ్రు, రేయికో

మూడె  యామము  లాయె -మోహయాత్ర

నేదొ  ఈ దారి నూరేగు  చుబుసుపోక

వేంచేసినార లీ వేగుబోక;

వలదు విడియగ నిట మానవతులె గాని

వలపు బిచ్చ మాశించెడు  వారులేరు;

పిలుచుచున్నవి  వేరె కౌగిళులు, వెడలు

మనుచు తెగనాడు ఖండిత యైన రాధ.

ఈ పద్యము తన్నుగాక వేరే ప్రియురాలితో (?) రాత్రంతా గడిపివచ్చిన ప్రియుడిని చూసి ఆగ్రహము పట్టలేక అతనిని తిరస్కరించే  ప్రియురాలి మనసులో వేదనను, అక్కసును తేటతెల్లము చేస్తుంది.  కోపంతో వెనుదిరిగిన రాధ శరీర భంగిమలో కోపాన్ని, ఆశాభంగాన్ని, దించుకున్న ముఖంతో అపరాధిలా నిలుచున్న కృష్ణుడిని చూస్తే  రాధను ఎలా సముదాయిస్తాడబ్బా అన్నట్టుగా బాపుగారు మనలను ఆలోచనలో పడేసారు.

 “ఇన్నాళ్లు విన్నాను; ఈనాడు స్వయంగా కంటున్నాను తమరి లీలలు. చాలా సంతోషంగా ఉంది. తమరి మేను మీది ఉన్న ఆ గంధపు గుర్తులు, తాంబూలపు ముద్రలు ఎవతివో తమరే చెప్పలేరు. వెయ్యికి పైగా ప్రియురాళ్ళేనాయే, రాత్రి మూడు జాములూ సరాగాలేనాయే మరి. ఈ దారమ్మట వెడుతూ, ఏదో ఉబుసుపోక ఈ తెల్లవారు జామున వచ్చారు. కాని ఇక్కడ అభిమానవతులే కాని ప్రేమ బిచ్చగత్తెలు ఎవరూ లేనందున ఇక్కడ ఉండడానికి ఎంత మాత్రము కుదరదు. అయినా రా రమ్మనమంటూ పిలిచే కౌగిళ్ళు ఉన్నాయి కదా అక్కడికే దయచేయండి”అని పట్టలేని కోపంతో, అసూయతో, వ్యంగపు మాటలతో ప్రియుడు కృష్ణుడుని తూలనాడుతూ వెళ్ళగొట్టే నాయిక  ఖండిత రాధ.  


కలహాంతరిత అలకతో ప్రియుతో ని కలహించి తరువాత శోకించే ముద్దరాలు

మన సార వలచి వచ్చినవాడు, నీ రేడు

తొగరేని మించు సోయగమువాడు;

లాలించినాడు, తన్నేలు కొమ్మన్నాడు -

చప్పగా వాయైన విప్పవపుడు;

అవియేటి అలకలో! ఆ మూతివిడుపులు,

ఆ మొండిపట్టులు, ఆ బిగువులు!

ఇక నిప్పుడోయమ్మ! ఎన్ని నిట్టూర్పులు!

అసురుస్సు రనుటలు, అలమటలును!

ఓస, ఇవియేటి  చేతలే  బై సి మాలి!

ఏరు విన్నను నవ్వగలారు లె" మ్మ

టంచు చెలిపల్క, తెలివొంది, అలవికాని

వెతల పా లౌచు కలహాంతరిత  తపించు

“చక్కదనములో చంద్రుడిని మించిపోయిన నీ నాధుడు, నిన్నే మనసారా ప్రేమించినవాడు, నీ చెంత చేరి తనను ఏలుకోమని లాలనగా అడుగుతుంటే, నీ నోటమ్మట మాటే లేదు. అప్పుడు ఆ అలగడాలు, మూతి విరుపులు, మొండి పట్టు పట్టడము, బింకంగా ఉండడాలు ఎందుకు? ఇప్పుడు ఈ ఎడతెగని నిట్టుర్పూలు, ఆయాసపడడాలు, వగవులు ఎందుకు? ఓయమ్మా! సిగ్గుమాలినదానా! నీ ఈ చేష్టలు దేనికి? ఎవరైనా వింటే నవ్విపోతారు చాలు చాలు లే”  అని మందలిస్తున్న తన చెలి మాటలను విని, తెలివి తెచ్చుకుని తన చేతలను తలచుకుని, తలచుకుని తల్లడిల్లు తరుణి కలహాంతరిత.

తనను చేరవచ్చిన విభుని తొందరపాటుతో, కోపంతో విసిరికొట్టిన తరువాత పశ్చత్తాపముతో వగచే ప్రియురాలి దైన్యతను వివరించిన పద్యానికి తగినట్టుగా బాపుగారి గీతలలో, కుపితయైన ప్రియురాలి ప్రవర్తనతో ఖిన్నుడై వెనుదిరిగిన ప్రియుడు, అది చూచి వేదనతో బేలయైన ఆమె, నేలపాలైన పూలదండ, గంధపు పాత్ర, ఆమె మానసిక అవస్థ మనకు బాగా అర్థమయ్యేటట్టుగా ఉన్నాయి.


ప్రోషిత భర్తృక దేశాంతరం వెళ్ళిన భర్త కోసం తపించిపోయే తరుణి

అటు చూడ వీటి ముంగిటను మౌనమ్ముగా

తల వాలిచి మన మందారతరువు!

పురి విప్పదు మన పెంపుడు మయూరమ్ము ది

గులుచెంది దిక్కుదిక్కులకు చూచు!

సారెసారెకు మన శారిక పలవించు

కలవరపడి ఏదొ పలుకబోవు!

ఏలాగు నీ మేఘవేళ ఒంటరి రేల

ప్రాణేశ్వరు ప్రవాసి బాసి " యనుచు

చల్లుకొను మేన చలువ గొజ్జంగినీరు;

గుప్పుకొను  కప్పురముతోడి  పుప్పొడులను;

పొరలు  సెజ్జ,  లేచి మరల నొరుగు సుంత ;

పొగులు ప్రోషిత భర్తృక  మగని కొరకు.

 

“మన ఇంటి ముందున్న మందార మొక్క పూలు పూయకుండా తలవాల్చి నిలుచుంది. ఇంక ఇటు మన పెంపుడు నెమలి పురివిప్పి నాట్యమాడడం మానేసి దిగులు దిగులుగా నాలుగు వైపులా చూస్తుంటే, గోరువంక మాటిమాటికి కలవరపడుతూ ఏదో చెప్పాలని సతమతమవుతోంది. పని మీద గ్రామాంతరం వెళ్ళిన పతిని మబ్బులు ముసిరిన ఈ ఒంటరి రాత్రి వేళ  ఎడబాసి ఎలా ఉండగలను?” అంటూ ఆ తాపాన్ని అణుచుకోవడానికి ఒడలంతా మొగలి రేకుల పన్నీరును చల్లుకుంటూ, కర్పూరపు పుప్పొడులను

అలదుకుంటూ, శయ్య మీద అపసోపాలు పడుతూ అటు ఇటూ దొర్లుతూ భర్త రాక కోసం వగచే వాల్గంటి ప్రోషిత భర్తృక.

ఈ పద్యములో ప్రవాసములో ఉన్న భర్త ఎడబాటును క్షణమైనా ఓపలేక తాను పడే బాధను అన్యాపదేశముగా పూవుల చెట్లను పెంపుడు పక్షులను ఉద్దేశించి చెప్పుతూ, పట్టరాని విరహ తాపాన్ని చల్లార్చుకోడానికి పరిమళ ద్రవ్యాలను ఆశ్రయించిన అలివేణి గురించి అలతి అలతి పదాలతో రమ్యంగా వర్ణించేరు. బాపు గారి కుంచె  సన్నివేశానికి తగినట్టుగా పూతీగలను, మయూరాలని, చిలకను, కదులుతూ వెడుతున్న మబ్బులను, గుమ్మములో నిలుచుని పాటి రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న బేలను మన ముందు  నిలిపేయి.

 






 


 

 

 

 

 

 


భిసారిక  ప్రియుడిని కలుసుకోవడానికి సింగారించుకుని బెదురుతూ అదురుతూ సంకేత స్థలానికి రహస్యంగా వెళ్ళే అతివ. 

నడిరేయి, కాని పున్నమి నాటి  వెన్నెల

పాల వెన్నెల జడివాన లీల!

హృదయేశు  డున్న ఆ పొదరింటి వర కొరుల్

పసిగట్టకుండ పోవలయుగాదె!

తెలికోక, తెలిరైక, తెలిమేలి ముసుగులో

మెయి సోయగపు మిసమిసలు దాచి

కాలి యందెల కడియాల గాజుల మువల్

రవళింపకుండ చెరగున జొనిపి

మోముపై,  కేలిపై గంద వొడి నలంది

పులుగు రవ్వంత గూట కదల బెదరుచు

ఆకుసడి కదరుచు, గాలి అడుగు లిడుచు

వెడలె నభిసారికగ ప్రియుకడకు రాధ.

 

అర్థరాత్రే కాని పౌర్ణమి నాటి వెన్నెల అయినందున పాలలాటి కాంతిని జడివానలా కురిపిస్తోంది. ప్రాణేశ్వరుడు ఎదురుచూస్తూ దాగి ఉన్ననికుంజము వద్దకు ఇతరుల కంట పడకుండా వెళ్ళాలి కదా.

శుభ్ర వస్త్రములను దాల్చి తెల్లటి మేలిముసుగులో తన మేని సోయగాన్ని,మెరుపులను కప్పిపుచ్చి, కాళ్ళకున్న అందెలు , కడియాలు, చేతిగాజుల మువ్వలు సడి చేయకుండా చీర అంచులోను, కొంగులోను దోపి, చేతులపైన ముఖ్యముపైన వొంటి నిండా మంచి చందనమును పూసుకుని, గూటిలో పిట్ట చిన్నగ కదిలినా అదురుతూ, ఆకు మెదిలినా బెదురుతూ, నేలమీద పాదాలు ఆనిఆననట్టుగా ఎత్తెత్తి అడుగులు వేస్తూ ప్రియుడైన కృష్ణుని  చేర అభిసారికలా పయనమయ్యింది రాధ.  

ఈ పద్యములో ప్రియుడుని దొంగచాటుగా సంకేత స్థలములో కలుసుకోవడానికి వెడుతున్న ప్రియురాలి మనసులో కోరికని, ఆతృతని, బెదురుని అందంగా చెప్పారు. ఇక బాపుగారి బొమ్మ మేఘాల మాటు నుంచి దోబూచులాడుతున్న వెన్నెల సోనలు, రాధ మేనిలో తడబాటు, గాలిలో తేలిపోతున్నట్టుగా ఆమె పాదాలు,  గాలికి కదులుతున్న పొదలు, దారికి అడ్డంగా ప్రాకుతున్న పాము ఆ సన్నివేశానికి  సజీవ కల్పన.

 

 

 

 

 

 

 

 

 

 

అష్టవిధ నాయికలు గురించి నేను వ్రాసిన దానిని ప్రచురించినందుకు, దానిని చదివి ప్రోత్సహించినందుకు  మీ అందరికి కృతజ్ఞతలు.

మన శృంగార శాస్త్రాలలో నాయకులను నాలుగు  రకాలుగా వర్ణించారు- అనుకూలుఁడు, దక్షిణుఁడు, దృష్టుఁడు, శఠుఁడు. అలాగే అలంకార శాస్త్రాలు లక్షణాలను బట్టి నాయకులను ధీరోదాత్తుఁడు, ధీరోద్ధతుఁడు, ధీరలలితుఁడు, ధీరశాంతుఁడు అని పేర్కొంది. వీరిలో ధీరలలితుడుకి ఉదాహరణగా కృష్ణుడిని  చెపుతారని అని ఎక్కడో చదివాను. అందుకే ఈ పద్యాలలో ప్రియుడైన కృష్ణుడిని దక్షిణనాయకునిగా, ధీరలలితునిగా నేను భావించాను.

దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి రచనలు బాపుగారి బొమ్మలు భావుక ఆమోదం ముప్పేటగా నా రచనకు అలంకారం.

నాకు అర్థమైనట్టుగా పద్యాలను వివరించడానికి ప్రయత్నించాను అందువలన ఏమైనా పొరపాట్లు ఉంటే అవి నా జ్ఞానరాహిత్యమే అని మన్నించండి. 

 

 
 
 

Recent Posts

See All
శ్రీశ్రీ

శ్రీశ్రీ చదువుకునే రోజుల్లో నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన ఆ మహానుభావుడి మీద భక్తితో, గౌరవంతో సమర్పిస్తున్న చిన్న నివాళి ఇది. "మింటనెచటనో...

 
 
 
విశ్వనాథ సాహిత్య దర్శనము

మనము చదివే కొన్ని రచనలకు వయసుతో పాటుగా వచ్చే పరిణితి, జీవితానుభావాలు, నిశితమవుతున్న అవగాహన, పెరుగుతున్న లోక జ్ఞానం మొదలైనవి ఏదో ఒక...

 
 
 

Comments


Post: Blog2_Post
  • Facebook
  • Twitter
  • LinkedIn

©2020 by nenu meeru. Proudly created with Wix.com

bottom of page