నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చి కమ్మని కల ఇచ్చింది
- Balatripura Sundari Venugopal

- Sep 26, 2023
- 1 min read
బాలు నీ గురించి, నీ పాటల ఘనత గురించి ఎందరో మహానుభావులు చాలా గొప్పగా, ఎంతో బాగా చెప్పారు, చెపుతున్నారు, చెపుతారు. కాని నీ పట్ల మా మనస్సులలో ఉన్నది చెప్పాలని ఎంతగానో ఉన్నా, వాటిని సరిగ్గా వివరించలేని మాలాటి వాళ్ళము ఎందరో ఉన్నాము. అయినా నీ పాటలే పాఠాలై నేర్పిన ధీమాతో వ్రాస్తున్న చిరు అంజలి ఇది.
ఏమి ఈ వింత మోహంతో మొదలైన ఈ మోహం ఎప్పటికి మాకు మొహం మొత్తేను బాలు? ఏనాటికైనా మా పాటలింతే వెయ్యేళ్ళకైనా మా తీరింతే (మల్లాది రామకృష్ణశాస్త్రి గారికి కృతజ్ఞతతో) అన్నట్టుండే మాకు నీ గానమారుతం కొత్త ఊపిరులూది, ఇంటా బయటా నీ గొంతుతో గొంతులు కలుపుకుని కులికే గాయకులము కాని, కాలేని మేము అనుభవించిన ఆ తీపి, తీపి జ్ఞాపకాలను మళ్ళీ మాకు ఎవరు ఇవ్వగలరు ఒక్క నువ్వు తప్ప.
సరిగమలశ్రుతిలో మాట అటుంచి వినడానికి ఇంపుగా కూడా పాడలేని చాలామందిని చక్కటి పాటగాళ్ళు / పాటకత్తెలుగా చేయడానికి, ఆకృతిలేని రాతిని అందమైన బొమ్మలుగా చెక్కడానికి ఒక శిల్పిలా, శ్రమపడిన నిన్ను చూసిన ధన్యజీవులము మేము.
మాటలకందని భావాలు మంచి పాటలలో పలుకుతాయి అన్నది నీ పాటలు విన్నాకే మాకు గ్రాహ్యంలోకి వచ్చింది. నీ పాటలు గుండె లోతుల్లోంచి వచ్చినందునే వాటిలో భావాలు రాగరంజితమై మా హృదయాలను గోదారిలా ఉప్పొంగిస్తుంటాయి. అమ్మవొడి వెచ్చదనం, నాన్న ఆప్యాయతపు ధనం, చిన్ననాటి చిలిపితనాలు, స్నేహ పరిమళాలు, ప్రేమలోని కమ్మదనం, యవ్వనములోని కలికితనాలు, దాంపత్యంలోని మాధుర్యాలు, భగ్నహృదయాల విషాదాలు, మందహాసాల మధురిమలు, నవ్వుల నజరానాలు....ఇలా మా అనుభూతులన్ని నీ గొంతులో పొందికగా అందంగా వొదిగించి, మమ్మల్ని సమ్మోహితులను చేసిన నీ గానం మాకు ప్రాణము అన్న నిజం నిజంగానే నిజమని నువ్వు వెళ్లిపోయేక అర్థమైన మా గొంతులు రవ్వంత సడిలేని రసహీన గీతాలైపోయాయి.
నువ్వు పాడుతుంటే రాళ్లు కరిగి వాటికి నోళ్ళొచ్చి కథలు చెపుతాయి. వాటికి సైదోడుగా ఆ పాటల పుట్టుక, గొప్పతనం అర్ధమైయ్యేలా సవివరంగా చెప్పడానికి తాపత్రయపడే నీలాటి గొప్ప గాధకుడు మాకు ఇంక ఎక్కడ దొరుకుతాడు?
నువ్వు పాడిన పాటలు చెక్కుచెదరని శిల్పాలుగా మా హృదయాలలో నిత్యమై సత్యమై నిలిచిపోయాయి. నువ్వు వెళ్లిపోయావన్నది అందుకే వొట్టి మాట.
సుందరి వేణుగోపాల్
సెప్టెంబర్ 25 , 2023
Comments