top of page
Search

శ్రీశ్రీ

  • Writer: Balatripura Sundari Venugopal
    Balatripura Sundari Venugopal
  • Apr 2, 2024
  • 5 min read

శ్రీశ్రీ

చదువుకునే రోజుల్లో నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన ఆ మహానుభావుడి మీద భక్తితో, గౌరవంతో సమర్పిస్తున్న చిన్న నివాళి ఇది.

"మింటనెచటనో మెరయు చుక్కల

                                                  కంట చూచితి కాంక్షలూరగ

                                                 కాంక్షలూరిన కొలది చుక్కలె

                                                కాంచి బ్రతుకే  గడిపితిన్"  (దేవులపల్లి కృష్ణశాస్త్రి)

 

   ఆ సాహితీ తేజం పేరు వింటేనే తెలుగు సాహిత్యం ఉత్తేజితమవుతుంది. సుమారు అర్ధ శతాబ్దం పాటు తెలుగు కవిత్వాన్ని శాసించిన మకుటం లేని మహారాజు. సంప్రదాయ ఛందోబద్ద కవిత్వాన్ని ధిక్కరించిన విప్లవ కవి. తెలుగుసాహితీ ప్రపంచానికి ప్రచండ భానుడు. అభ్యుదయ భావాలతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైతాళికుడు. శాస్త్రవేత్త, ఆలోచనాపరుడు, దార్శనికుడు, హేతువాది, నాస్తికుడు. ఆయనే విశ్వవిఖ్యాత శ్రీశ్రీ అనబడే శ్రీరంగం శ్రీనివాసరావు. పైన పేర్కొనబడిన  కవితను శ్రీశ్రీలోని చల్లారని నిప్పువలె జ్వలిస్తున్న కవితాశక్తికి అన్వయించుకోవచ్చును. 1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది తరువాత దానిని నేను నడిపిస్తున్నాను. తెలుగు సాహిత్య చరిత్ర శ్రీశ్రీ స్వీయ చరిత్ర అన్న ధీశాలి.

 

  1947లో నంద్యాలలో జరిగిన ఎన్నికల సభలో శ్రీ చండ్రరాజేశ్వరరావు శ్రీశ్రీని మహాకవి అని ప్రశంసించిన నాటి నుంచీ అదే ఆయనకు ఇంటిపేరైంది. శ్రీశ్రీ అనే రెండక్షరాలు ఒక మనిషి పేరు కాదు. మహాకవి అని పిలుచుకోవడానికి మరో మరో పదమూ కాదు. శ్రీశ్రీ అనే పాత ప్రపంచంపై విరుచుకుపడిన ప్రళయం, ప్రకృతిలో ఎప్పుడో గాని సంభవించని అరుదైన అద్భుతం. శ్రీశ్రీ అంటే నిరాశ సోకలేని ధైర్యం. ఈ వ్యవస్థని భూస్థాపితం చేయగలమని, మానవ విలువలు వికసించే మహా సమాజాన్ని నిర్మించుకోగలమనే ధైర్యం (నగ్నముని).

 

   కవిత్వమంటే  ఏమిటి? దాని  ప్రయోజనం లేదా లక్ష్యం ఏమిటి? అనే ప్రశ్నలకు సామాజిక వాస్తవికత, వామపక్ష భావాలు, మార్క్సిస్టు దార్శనికత, ప్రాచీనాధునాతనాంధ్ర సాహిత్యావలోకనం, పాశ్చాత్య వాజ్మయ మథనాల ప్రభావాల సమ్మేళనమైన శ్రీశ్రీ కవిత్వమే జవాబు. తెలుగు సాహిత్యపు లోతులతో పాటుగా ప్రపంచ సాహిత్యాన్ని,  స్పెన్సర్ నుంచి జాయిస్ శైలి వరకు ఆంగ్ల కవిత్వపు పోకడలను, ఆలివర్ గోల్డ్ స్మిత్, విలియం వర్డ్స్ వర్త్ , జాన్ కీట్స్, పెర్సీ బైస్షే షెల్లీ వంటి ఆంగ్ల కవుల రచనలను ఔపోసన పట్టిన ఆయన తనకు నచ్చినవాటిని అనువదించారు, అనుకరించారు, అనుసృజించారు.  

 

   ప్రయోజనాత్మకమైన ఆయన రచనలకి విలక్షణమైన ఆయన వ్యక్తిత్వము, గాఢప్రతిభ మరింత ప్రత్యేకతను ఆపాదించాయి. తన నుదుటి రాతను ఎంతమాత్రం నమ్మకుండా, చేతిరాతే ఊతగా తన నొసటి రాతను తనే వ్రాసుకుని, “నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను” అని బ్రతికిన హాలికుడు శ్రీశ్రీ. ఎప్పుడూ నేను పెడసరంగా వాదిస్తానేం? అందరు వద్దంటున్న పనులే చేస్తానేం? ఎప్పుడూ ఇంకోవైపు చూస్తానేం? ఎందుకంటే అన్నిటికీ ఇంకోవైపు ఉంది కాబట్టి- అని ప్రశ్నలు వేసుకుని, జవాబు తానే చెప్పిన శ్రీశ్రీ ఎంతో గొప్పవారు. అంతకంటే ఆయన కవిత్వం గొప్పది. ఆ కవిత్వానికి ఆయన ఎన్నుకున్న మార్గం మరింత గొప్పది.

    ఆధునిక కవితకు గురజాడ, అభ్యుదయ కవితకు శ్రీశ్రీ చిరునామాలు. తిక్కన, వేమన, గురజాడ తన కవిత్రయం అని చెప్పుకున్నా, తన అడుగుజాడ గురజాడది అని ఉద్ఘాటించిన ఆయన మీద గురజాడ అప్పారావుగారి ప్రభావం ఎంతైనా ఉంది. ఆయన మేధోవారసుడుగా భావ కవిత్వానికి దూరమై తన కవిత్వాన్ని అభ్యుదయవాదానికి సాధనంగా మార్చుకున్నారు. పూర్వుల వలె వ్రాస్తేనే…… చెప్పలేను సిరిసిరి మువ్వా  అంటూ సంప్రదాయ కవితా ధోరణినుంచి అభ్యుదయ పధము వైపు పయనం సాగిస్తూ, నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళము అనితర సాధ్యం నా మార్గం అని ఆత్మవిశ్వాసంతో తన రచనా వ్యవసాయాన్ని సాగించారు. తన భావాలెంత తీవ్రమైనవో అంతే పదునుగా వాటిని వ్యక్తీకరించే ప్రతిభ గల శబ్దవిరించి శ్రీశ్రీ.  పదలయ ఆయన ప్రత్యేకత. ప్రాసకు , శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో మేటి. తెలుగులో నవ్యసాహిత్యానికి విశృంఖలమైన స్వేచ్ఛను కల్పించారు.

 

    ఆయన మహామానిషి అని, తనను తాను తెలుసుకున్నతత్త్వవేత్త అని ఎందరికి తెలుసు? స్వభావరీత్యా ఏ విషయాన్నైనా అంతు పట్టేవరకూ విడిచిపెట్టక నిత్యమూ శాశ్వతము అయిన మార్గ అన్వేషకుడు అయిన ఆయన దేనినీ మూఢంగా నమ్మలేదు, దాన్నే అంటిపెట్టుకుని ఉండలేదు. స్వేచ్ఛాజీవనము, స్వచ్ఛమైన ఆలోచనలు ఉన్నందునే ఆయన అందరికన్నా ఎప్పుడూ పై మెట్టు మీదనే ఉండేవారు.

 

   ఆయన ఘనత సాంఘిక ప్రయోజనాన్ని కవితా సృష్టికి వేదికగా మలచడమే. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతినిచ్చాను అనే వారి కవిత ఆధునిక వ్యక్తివాదానికి, ప్రాచీనుల సమిష్టివాదానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధానికి ఒక వారధి. భావ కవిత్వపు దారి నుంచి వైదొలగి "కదిలేది, కదిలించేది, మారేది, మార్పించేది నవకవనం" అంటూ శ్రామిక  కళ్యాణానికి పట్టం కట్టిన ఆయన శ్రామిక వర్గ విజయం తధ్యం అనే విశ్వాసాన్ని పొలాలన్నీ దున్ని.....ధర్మ జలానికి ఘర్మ జలానికి ఖరీదు లేదోయ్ (ప్రతిజ్ఞ) అని ఎలుగెత్తి చాటారు. లండన్ అభ్యుదయ రచయితల మేనిఫెస్టో  ప్రభావంతో,  జాతీయ దురహంకారాన్ని నిరసిస్తూ “ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణము ? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం" (దేశ చరిత్రలు) అని ఆక్రోశించారు. "దేవతలతో జోడు కూడితి; రక్కసులతో కూడి ఆడితి; కొత్త మిన్కుల తెలివి పటిమను మంచి చెడ్డల మార్చితిన్" అన్న గురజాడ ప్రభావముతో మనిషి మీద తనకు గల ప్రేమను, అభిమానాన్ని మంచి/చెడ్డ, వెలుగు/చీకటి, చావు/బ్రతుకు, మనిషి/దేవుడు అంతా ఒకటే”  అంటూ  ఈ ఏకం ఎవరో కాదు మానవుడు. అతడే సత్యం, అతడే నిత్యం, అతడే ఈశ్వరుడు (చరమరాత్రి) అంటూ, అజేయమైన మానవ శక్తి విరాట్ రూపాన్ని “రాశిచక్ర గతులలో..........వియోగీ యోగీ భోగీ త్యాగీ” అనే కవితలో దర్శించారు. (మానవుడా).

 

      సామాన్యుడి దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే సమకాలీన సమస్యలైన  గ్రాసం, వసనం, వాసం గురించి వ్రాసిన ఆయన నిజంగా నేను ప్రజల కవినేను, ఎంచేతంటేను వాళ్ళని చదివేను, చదివిందే రాసేను (ఔను కవిత లిమఋక్కులు) అని పేర్కొంటూ సామ్యవాదం ఈనాటి వేదం అందరిలో మారుమోగే నినాదం అందరికీ అందిస్తుంది మోదం అది సఫలం సఫలం శ్రీదం (సుజలాం సుఫలాం కవిత) అని సామ్యవాదం పట్ల తన ఆశావాదాన్ని వ్యక్తం చేశారు.

 

     అంతా  బాగానేవుందని, అంతా సుఖంగానే ఉన్నారని అన్నానంటే మాత్రం అది అబద్ధమే అవుతుంది అని నిజాయితీగా పలికారు. వేగుజూక్క వెలిగె మింటిపై ….. పేద ప్రజల పక్షం వహించడమే పెద్ద అపరాధమైపోయింది అని వాపోతూ విప్లవకారుల విధ్వంస బీభత్సకాండకు నా ప్రశంస అదెన్నడూ కానేరదు హింస, అది నూతన చేతవారి రంస, మా నవ మానస, మా నస సరోవర హంస అంటూ హూంకరించారు.

పీడిత ప్రజల ఆక్రోశాలను పట్టించుకోని  సంఘాన్ని దుయ్యబడుతూ, వారు  అనుభవిస్తున్న నిరంకుశ అధికారాన్ని ఎదురించే చావని పెంచుకోమని, పాత  పద్ధతులు, విశ్వాసాలు కుప్పకూలిపోయటట్టుగా  కదం తొక్కమని  "రాబందుల రెక్కల చప్పుడు పయోధర ప్రచండ ఘోషం. ఝంఝానిల షడ్జధ్వానం" అంటూ ప్రబోధించారు. అహింస ఒక ఆశయమే కాని ఆయుధం ఎప్పుడూ కాదు. ఆశయం సాధించాలంటే ఆయుధం అవసరమే మరి అని అని నిక్కచ్చిగా చెప్పారు. (ఖడ్గ సృష్టి)

 

      తెలుగు సాహిత్యానికి దిక్సూచిలా వెలుగొందిన కవితా సంకలనం మహా ప్రస్థానం ఆయన కవితా ప్రస్థానంలో ఓ మైలురాయి. ఆధునిక సాహిత్యాన్ని మహా ప్రస్థానానికి ముందు, తర్వాత అని రెండుగా విభజించి చెప్పడం అతిశయోక్తి కాదు. మహాప్రస్థానం గొప్పతనము దానిలో ఉన్న పదవిన్యాసాలవలనో లేదా శబ్ద గంభీరతవల్లనో వచ్చినది కాదు. దానిలో ఉన్న ఒక అంతు పట్టీ, పట్టని తత్త్వసౌందర్యం వల్లన. శ్రామికవర్గమే సామ్యవాద విప్లవాన్ని తెచ్చి బూర్జువా వర్గం సృష్టించే అసమానతలను నిర్మూలిస్తుందని ఈ కవితా సంపుటి లోని కవితా వస్తువు తెగేసి చెపుతుంది. సామాజిక రుగ్మతలకు సరైన శస్త్రచికిత్స విప్లవమే అని బోధించిన మహాప్రస్థానం ఒక సందేశాత్మక కావ్యంగా ఈనాటికీ ఎంతోమందిని ఉత్తేజితులను చేస్తోంది. ఈ రచనలో అభ్యుదయ కవిత్వము, విప్లవ బీజాలూ ఉన్నాయి కాని విప్లవ సాహిత్యం లేదు.

      కాలానికి కళ్ళెం వేస్తాము, ప్రేమకు గొళ్ళెం తీస్తాము అంటూ పడుచుగుండెలకు రెపరెపలు కల్పించి, పుడమితల్లికి పురిటి  నొప్పులు, మరో ప్రపంచం పుడుతూ వుంది, అదిగో కనబడలేదా, మరో ప్రపంచపు అగ్ని కిరీటపు ధగధగలు అని కలవరపెట్టి, ఆకాశపుదారుల వెంట హడావుడిగా వెళ్లి పోయే రథ చక్రాలను భూమార్గం పట్టిస్తాను, జనావళికి శుభం అంటూ సాంత్వన పరిచి నూతనోత్సాహాన్ని ఉద్రేకాన్ని కలిగించడమే కాకుండా సమాజానికి కొత్త కొత్త లక్ష్యాలను నిర్దేశించడములో విప్లవ దారుల వెంట వేగంగా పరుగులే తీసింది ఆయన కలం. ఈ వ్యవస్థని భూస్థాపితం చేయగలమని, మానవ విలువలు కుదిరితే పరిగెత్తు లేకపోతె నడువు అది చేతకాకపోతే పాకుతూ పో అంతేకానీ కదలకుండా అలా ఒకే చోట ఉండిపోకు అంటూ యువశక్తీ ఉర్రూతలూగే ఉత్సాహ శక్తీ!  ఉప్పొంగిపోయే ఉద్రేక శక్తీ! యువ శక్తీ నవయుగ శక్తీ! విడుదల పొందిన అణుశక్తీ! విజయం చాటే శ్రమ శక్తీ  అని అంటూ ఉత్తేజపూర్వకంగా యువత  వెన్ను తట్టారు.

 

    శ్రీశ్రీ అభ్యుదయ కవిగా సాహిత్యరంగంలో సుస్థిర స్థానాన్ని పొందినతరువాతే చలనచిత్రరంగములో తనదైన ముద్రను వేశారు. మహాప్రస్థానం ద్వారా అంతో ఇంతో  తెలుగు సాహిత్యంతో పరిచయము ఉన్నవారికి శ్రీశ్రీ  తెలిసినట్టే, చలనచిత్ర పాటల ద్వారా ఆయన ఎంతోమంది సామాన్యులకు మాన్యులు. ఆయన మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి కవితా సంకలనాలనుంచి ఎన్నో కవితలు సినిమా పాటలుగా రూపొంది జనసామాన్యాన్ని ప్రభావితం చేశాయి. మచ్చుకు కొన్ని నేల మనది, నింగి మనది, గాలినీరు వెలుగు మనది, అదును చూసి  పదును చేసి అన్నిటిని అదుపు చేసి (పాడిపంటలు రైతన్నా ) పతితులార, భ్రష్టులార బాధాసర్పద్రష్టులార (జగన్నాథ రథ చక్రాలు) మొదలైనవి.

కొంతమంది ప్రముఖుల మాటలలో శ్రీశ్రీ

ఆయన యోగ్యత విశిష్టత - ఔన్నత్యంలో హిమాలయం, ఔద్ధత్యంలో మేరు పర్వతం - ఆరుద్ర.  

విప్లవ శ్రీశ్రీ - ప్రజల సిరి యీ శ్రీశ్రీ, ప్రజాక్రోధశ్రీ యీ శ్రీశ్రీ - కాళోజీ 

ఎవరి నీడలో యీ శతాబ్దపు తెలుగు కవిత్వం (సాహిత్య ప్రక్రియలన్నీ కాదు) తన ఉనికిని ప్రోది చేసుకుందో; యెవరి మహాప్రస్థానం తెలుగులో ఆధునిక కవులను ఉద్భవింపించిందో; యెవరి మహాప్రస్థానం చాలా పదాలకి అర్థం తెలియకపోయినా బలంగా కదిలించిందో ప్రగాఢంగా అనుభూతి కంపించిందో; యెవరి మహాప్రస్థానం తన జాతి జనులు పాడుకునే మంత్రంగా నిలిచిందో ఆ వ్యక్తి - శ్రీశ్రీ. ఈ శతాబ్దానికి ఒకే ఒక్క శ్రీశ్రీ - వడ్డెర చండీదాస్   

"శ్రీ అంటే ఒక వ్యక్తికి గౌరవ వాచకం. శ్రీశ్రీ  అంటే తెలుగు జాతికి గౌరవ వాచకం" - ఇంద్రగంటి  శ్రీకాంత శర్మ

తన రచనలలో లోకం ప్రతిఫలించాలని, తన గీతాన్ని జనులు పాడుకునే మంత్రంగా మ్రోగించాలని, తన ఆకాశాలను లోకానికి చేరువగా, తన ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా కురిపించాలని జీవితమంతా ఒక తపస్సుగా గడిపిన మహాకవి శ్రీశ్రీ. (17 .6 .83  ఆంధ్రజ్యోతి దినపత్రిక  సంపాదకీయం)

కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్నతెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది – బూదరాజురాధాకృష్ణ

అందరాని చందమామలా వెలుగుతున్నతెలుగు సాహితీ సౌరభాల్ని సామాన్యుల ముంగిట అందచెయ్యడానికి పాటుపడ్డ శ్రీశ్రీ పేరు తెలియని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తికాదు. తెలుగు సాహిత్యంలో సామాన్యుడి కష్టనష్టాల గురించీ, పేదసాదల జీవితాలని ప్రతిబింబించే కవిత్వాన్ని రాసిన మొదటి కవిగా ఆయన తెలుగువారందరికీ చిరస్మరణీయుడు. తెలుగు భాష, తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో ఆయన కీర్తి వెలుగులు చిమ్ముతూనే ఉంటుంది.

“కవన ఝరి జీవ నది. వ్యక్తులు మరణిస్తారు. లేదా వారి వ్యాపకాలు స్తంభిస్తాయి. అయినా కొత్త శక్తులు ఒకదాని తర్వాత ఒకటి పుట్టుకొస్తూనే వుంటాయి. జీవితానికి మరణము లేదు. జీవిత విజయాన్ని చాటే కవనానికి మరణము లేదు”  అని నిర్ద్వందంగా ప్రకటించిన మహాకవి శ్రీశ్రీ నిజంగా అమరులు .

 

*****

సుందరి వేణుగోపాల్


 
 
 

Recent Posts

See All
విశ్వనాథ సాహిత్య దర్శనము

మనము చదివే కొన్ని రచనలకు వయసుతో పాటుగా వచ్చే పరిణితి, జీవితానుభావాలు, నిశితమవుతున్న అవగాహన, పెరుగుతున్న లోక జ్ఞానం మొదలైనవి ఏదో ఒక...

 
 
 

Comentários


Post: Blog2_Post
  • Facebook
  • Twitter
  • LinkedIn

©2020 by nenu meeru. Proudly created with Wix.com

bottom of page