top of page
Search

విశ్వనాథ సాహిత్య దర్శనము

  • Writer: Balatripura Sundari Venugopal
    Balatripura Sundari Venugopal
  • Nov 30, 2023
  • 5 min read

మనము చదివే కొన్ని రచనలకు వయసుతో పాటుగా వచ్చే పరిణితి,

జీవితానుభావాలు, నిశితమవుతున్న అవగాహన, పెరుగుతున్న లోక జ్ఞానం మొదలైనవి

ఏదో ఒక క్రొత్తదనాన్ని జోడిస్తాయి. అందువల్లనే ఎప్పుడు చదువుతున్నా అప్పుడే

మొదటిసారిగా చదువుతున్నట్టుగా అనిపిస్తుంది. విశ్వనాథవారి రచనలు అటువంటి కోవకే

చెందుతాయి.

పుంభావ సరస్వతి అయిన విశ్వనాథవారు తెలుగు సాహిత్యములో ఒక

హిమాలయోత్తుశృంగం. మహాకవి, ఉద్దండ పండితుడు, ఉత్తమ చరిత్రకారుడు,

ఇతిహాసికుడు, సంప్రదాయ సాహితీవేత్త, నవలాకర్త, కథా రచయిత. ముక్తకాల నుంచి

ఇతిహాసాల దాకా సాగిన ఆయన రచనా వ్యాసాంగం సాహిత్య రంగంలో స్పృశించని ప్రక్రియ

లేదు. కథ, నవల, నాటకము, పద్యకావ్యాలు, ఖండకావ్యాలు, గేయ కథలు, గేయాలు,

కవిత్వం, వీర గాథలు, ఏవైనా కానీయండి. శతాధిక రచనలు చేసిన కావ్య ఋషి

విశ్వనాథవారు. విశ్వనాథవారి రచనలు అలవోకగా చదివి ప్రక్కన పెట్టేసే పుస్తకాలు కావు.

లోతు, రీతి కలిగి నిగూఢమైన శాబ్దిక సంపదతో మనలను ఆలోచించేట్టు చేసే విజ్ఞాన

గనులు.

ఎంతో ఘనమైన మన దేశ వాస్తవిక చరిత్రను క్రమబద్ధమైన రీతిలో నవలాప్రక్రియ

ద్వారా అక్షరబద్ధము చేసి మనకు ఎంతో మేలు చేసిన క్షేమంకరుడు. పురాణాలన్ని

కట్టుకథలే అని అసత్య ప్రచారం చేసేవారికి కనువిప్పు కలిగేలా పురాణవైర గ్రంథమాల

పేరిట సనాతన ధర్మ ప్రాభవాన్ని వర్ణిస్తూ “భగవంతుని మీద పగ”, “నాస్తిక ధూమము”

మొదలైన 12 గ్రంధాలుగా వ్రాసారు. దేశానికే మకుటాయమానమైన కాశ్మీరు దేశపు

చరిత్రను కాశ్మీరు రాజ వంశ నవలలుగా (ఆరు), హిందుమతారాధకులైన నేపాళ రాజుల

చరిత్రను నేపాళ రాజ వంశ నవలలుగా (ఆరు) మనకు అందించి మహోపకారం చేశారు.

వైవిధ్యం, ఏకసూత్రత, విశాలదృక్పథం కల విశ్వనాథ రచనలు భారతీయ

వాఙ్మయములోని ఉదాత్త సంస్కృతికి ప్రతీకలు. తెలుగు ప్రామాణిక గ్రంధములకు

సంబంధించిన విషయాలలో ఆయన ఒక గొప్ప విమర్శకులు. ఆయన వ్రాసిన సాహిత్య

విమర్శనా గ్రంధాలు తెలుగు సాహిత్యములో విమర్శనాత్మక భావములను విప్లవాత్మకము

కావించాయి.

ముఖ్యముగా విశ్వనాథ నవలను కావ్యంగా, తత్వ విచారంగా రూపొందించారు. అది

ఆయన తెలుగు సాహిత్యానికి కూర్చిన నవ్యత. ఈ నవ్యతే విశ్వ సాహిత్యములో తెలుగు

నవలకు స్థానము కల్పించింది.

పరాయిపాలనలో భావదారిద్య్రము తోనూ, పాశ్చత్య సాహిత్య ప్రభావంతో

భావదాస్యంలోనూ నిద్రాణమైన తెలుగువారిని మేలుకొలపడానికి ఆయన సంధించిన

సాహిత్య తూణీరాలు ఎదురులేని మేటి విలుకాడుని తలపింపచేస్తాయి.

ఆయన రచనలు పూర్వ పక్షపాతము లేకుండా చదివితేనే, ఆయన చూపిన నవ్య

పోకడలు స్పష్టమవుతాయి. కాకపొతే అవి చాలా ఉదాత్త స్థాయిలో ఉన్నందున సామాన్య

పాఠకులమైన మనకు కొరకరాని కొయ్యలు.

వేమన శతకకారుడు చెప్పినట్టుగా

“అనగ ననగ రాగ మతిశయిల్లుచుండు,

తినగ తినగ వేము తియ్యనుండు,

సాధనమున పనులు సమకూరు ధరలోన”

చదవగా, చదవగా ఆయన రచనలలో సొగసులు, వస్తు వైవిధ్యము మనలను సమ్మోహన

పరుస్తాయి.

ఆయన శైలి ప్రాచీన కవుల శైలిని పోలి ఉన్నా, ఆయన రచనలన్నీ నవ్యత్వముకే

పట్టము కట్టాయి. కొత్త భావనలు, నూతన ప్రయోగములు, వివిధ ఘట్టములలో

వెలరించిన కథాకథన శైలి అంతా ప్రత్యేకమైనవే. ఆయన భాష, భావవ్యక్తీకరణ

అనితరసాధ్యము. ఆయన దృష్టిలో శబ్దము, భావము విడదీయరానివి. ఆయనకు

పూర్వమున్న కవులు కేవలము శబ్ద పరిపూర్ణతకే ప్రాధాన్యమిచ్చినందున వారి పంథాను

అనుసరించలేదు. ఆయన వాడిన ప్రయోగములు సందర్భానుసారంగా “సాంకేతికములు,

బౌద్ధికములు, మనోద్వేగభరితములు.” అవి నాటికి, నేటికీ, ఇంకో నాటికి వర్తించేవే.

ఉపనిషత్తులు, విజ్ఞాన, తర్క, వేదాంత, అలంకార, నాట్య, భౌగోళిక, బౌద్ధ,

జొరాస్ట్రియన్ మత శాస్త్రాలపైన మంచి అవగాహన ఉన్నందునే, తాను వ్రాసిన సుమారు

అరవైకి పైగా రచనలలో వైజ్ఞానిక, మతము, కళలు అనే అంశాల గురించి విపులంగా

చర్చించారు. తన రచనలలో అలంకారములు ఆయన స్వయముగా కూర్చినవే.

ఉత్కృష్టమైన మనో వైజ్ఞానిక విషయముల గురించి కానీ, సామాజిక సమస్య, తాత్విక,

నాటకములకు సంబంధించిన విషయములను వ్రాస్తున్నప్పుడు కానీ ఆయన పొందే

పారవశ్యం అనుభవ నైవేద్యమేగాని వర్ణింపలేనిది.

ఆయనకు ప్రత్యేకంగా అభిమాన రచయితలంటూ ఎవరూ లేరు. కళాత్మక

విషయమున్నవస్తువు ఉన్న ఏ రచననైనా, రచయితనైనా ఆయన అభిమానించారు.

ఆయన దృష్టిలో వేదములు, ఉపనిషత్తులతో అలరారుతున్న తెలుగు సాంప్రదాయక

ప్రాచీన సాహిత్యము ఇతరులకు అలవి కానిది. వివిధ విషయాలపై, ప్లేటో, గోగోల్, టాల్

స్టాయ్, దోస్తోవస్కీ, మాక్సిం గోర్కీ, మామ్, ఇబ్బన్, నోయల్ కోవర్డ్, జిమ్ కార్బెట్,

ఆండర్సన్ మొదలైన అనేక పాశ్చాత్య రచయితల పుస్తకాలు చదివి ఆకళింపు

చేసుకున్నవారు.

విశ్వనాధవారి సాహిత్య సృష్టిలో దేనిని తీసుకున్నాఅందులోని పాత్ర చిత్రణ, విషయ

వస్తువు చాలా క్రొత్తగా, విశిష్టంగానూ ఉంటాయి. కథాకథనంలో ఆయనకు సాటి ఆయనే.

ఎటువంటి కథ అయినా కథలోని నిర్మాణ కౌశలం, పాత్రల చిత్రణ మూలంగా ముగింపు

వరకు చదవవలసిందే.

ఆయన రచనలలో అత్యంత కీర్తిని తెచ్చినవి మాహేతిహాసాలుగా గణనకెక్కిన

“రామాయణ కల్పవృక్షము”, “వేయి పడగలు” అనే రెండు ఉత్కృష్ట రచనలు. రామాయణ

కల్పవృక్షము అంతర్ముఖమైంది. వేయి పడగలు బహిర్ముఖమైంది.

పూర్వమే రచింపడిన రామకథకు విశ్వనాథ వారు రాసిన రామాయణ

కల్పవృక్షము కళాత్మక చిత్రీకరణే కాకుండా ఆయన సృష్టించిన అనేక సాహిత్య, భాషాత్మక

పరమైన నూతన పోకడలకు నెలవు. రసాత్మకమైన ఈ కావ్యములో విశ్వనాథవారు

తెలుగు వారి జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్లుగా, నిజాయితీగా చిత్రీకరించారు. ఆనాటి

కుటుంబ విలువలు, సామాజిక స్థితి గతులు, రీతి, రివాజులు, ఆచార వ్యవహారాలు,

ఏకపత్నీవ్రతము, విపరీతపు పోకడలు మొదలైన ఎన్నో వాటి గురించి కూలంకుషంగా

చర్చించారు. ఇందులో వర్ణనలు కవి స్వానుభవం నుంచి పుట్టినవి. తెలుగులో వచ్చిన

రామాయణాలన్నీ విశిష్టాద్వైత ప్రతిపాదములై ఉండగా, రామాయణము అద్వైత మత

సమర్ధకమని, శ్రీవిద్యా ప్రతిపాదకమని నిరూపించడానికి రామాయణ కల్పవృక్ష రచన

చేశానని విశ్వనాథ వారి ఉవాచ.

“కల్పవృక్షం వాల్మీకి రామాయణముకు అనువాదం కాదు వాల్మీకి హృదయ

వ్యాఖ్యానము.” (ధూళిపాళ శ్రీరామ మూర్తి)

వేయిపడగలు ఎంతో విస్తృత సామాజిక పరిణామ చరిత్ర, వస్తుపరమైన లోతూ,

నాటకీయత, గొప్ప పఠనీయత ఉన్న నవల. ఆత్మాశ్రయ కవితా ధోరణిలో సాగిన ఈ నవల

చిన్నపాటి విజ్ఞాన సర్వస్యము. హైందవ వ్యవస్థకు మూలతత్వమైన సనాతన ధర్మాన్ని

ఆయన ఎంతగానో ఆరాధించారు. వేయిపడగలు ప్రకృతిలో ఉండే సంచలనాన్ని భంగం

చేయడము వలన మానవ జీవితాలు ఎన్ని కడగండ్లను అనుభవించవలసి వచ్చిందో,

వివరంగా చిత్రీకరించింది. గతించిన, గతించిపోతున్న ఒకానొక వ్యవస్థను గురించిన మహా

కవితాత్మక దుఃఖం వేయి పడగలు.భ్రమరవాసిని శ్రీవిద్యానిగూఢ రహస్యములను తెలియచేసింది.మ్రోయు తుమ్మెద లో హిందుస్తానీ సంగీతానికి సంబంధించిన అభిజ్ఞ,

కిన్నెరసాని పాటలలో సంగీతంపట్ల అభిరుచి,ఏకవీరలో కూచిపూడి నాట్య సిద్ధాంతము నందున్న గణనీయమైన ప్రతిభ,శ్రీ కృష్ణ సంగీత పద్యకావ్యములో 108 శీర్షికలతో 32 పాదములు గల గీత పద్యాలు(ఒక్కొక్కదానికి) - ఒక శీర్షికలో 80 మంది గోపికలు కృష్ణుని 80 రకాలుగా వేడుకున్నవిధము,600 పద్యములుగల ప్రబంధము రైతు చరిత్ర ఖగోళ శాస్త్ర, నక్షత్ర మండల విశేషాలతో సంపుష్టమైనది,ప్రద్యుమ్నోదయము - రుక్మిణి కళ్యాణము గురించి రాసినా, వైష్ణవ తత్వముకి చెందిన చతుర్వ్యూహముల (వాసుదేవ సంకర్షణ, ప్రద్యుమ్న,అనిరుద్ధ) అర్ధాల వివరణ

“కవిత్వాన్ని నేను నా ఇచ్చాపూర్వకముగా రాస్తాను కానీ కాల్పనిక సాహిత్యము ఇతరుల

కోరిక మేరకు వ్రాసినది” అని విశ్వనాథ వారంటారు


వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు తేనెధారలు చిలికిన ఈ పవిత్రభూమికి

అత్యంత ప్రాచీన చరిత్ర ఉంది. మతంతో పెనవేసుకున్న ఆ చరిత్ర నిరంతరం, తరతరాలుగా

తనదైన అస్తిత్వాన్ని నిలుపుకుంటూ, ప్రవహిస్తూనే ఉంటుంది. కాని విశ్వనాథ వారికి

మతం ఎప్పడూ ముఖ్యము కాదు. వారి దృక్కోణములో సంస్కృతి, మతము ఒకటి కావు.

మతము సంస్కృతిలో ఒక భాగము మాత్రమే. మన సంస్కృతికి హాని కలిగించే ఎటువంటి

అంశాన్ని అయినా తన సర్వశక్తులు ఒడ్డి అణచివేయాలనే ధృడసంకల్పము వారి

సాహిత్యంలో అడుగడుగునా ద్యోతకమవుతుంది.

“మా మతమున దేవుడున్నాడని కాదు, ఆ దేవుడుండనిమ్ము చావనిమ్ము

సర్వమయిన సృష్టియందును ప్రాణము, జీవము, ఆత్మ కలకల

లాడుచున్నావని మా పూర్వఋషులు చూచిరి. సర్వవస్తుగత

ప్రాణమును సమారాధించిరి. అంతకన్నా భూతదయ లేదు” (వేయి పడగలు)

విశ్వలయ అంటే మన లోపల వెలుపల, ప్రకృతితోను, విశ్వచైతన్యముతోను మనకు

కల సమరసపూర్వమైన తుల్యత. అటువంటి విశ్వలయను విశ్వనాథవారి సాహిత్యములో

మనము చూడగలము. విశ్వనాథవారి ఆధ్యాత్మిక అంతర్దృష్టి దీనికి తత్వపరిపూర్ణతను

కలిగించింది.

స్వేచ్ఛా కామ సంచరణానికి వ్యతిరేకంగా ప్రబలిన ఒక భావ సాంస్కృతిక సిద్ధాంతం

కులపాలికా ప్రణయం. (తొలుదొల్త ప్రవేశ పెట్టినవారు డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు)

స్వేచ్ఛా కామ సంచరణము దేహాజనితమైతే, కులపాలికా ప్రణయము భావ జనితము. ఈ

రెంటి సమన్యయము మీదనే దాంపత్య వ్యవస్థ సుస్థిరత ఆధారపడి ఉంది. పెళ్ళి, ప్రేమ,

దాంపత్యము, కట్టుబాట్లు వీటి మధ్య తగిన సయోధ్యను సాధించడమే తన కర్తవ్యం అని

బలంగా నమ్మిన విశ్వనాథ, కులపాలికా ప్రణయ సిద్ధాంతానికి తన రచనలలో పెద్ద పీట

వేశారు. దీనికి ఉదాహరణలు ఏకవీర (సమన్యయము కుదరక పోతే జరిగే అనర్థాలను

చూపించింది), కిన్నెరసాని (వ్యవస్థను ఎదురించి రక్షణ కొరవడి స్వతంత్రించి

మెరుగుపడిన తన వ్యక్తిత్వముతో భక్తుల సేవలో సార్థకం పొందింది), చెలియలి కట్ట

(రత్నావళి వ్యవస్థను సరకు చేయక కట్టుతప్పి తన జీవిత లక్ష్యాన్ని గ్రహించి మళ్ళీ

సముద్రుడిని చేరుకుంది) వేయిపడగలు (అరుంధతీ ధర్మారావులు, శశిరేఖ కిరిటీలు

దాంపత్య జీవితాన్ని పండించుకున్న పుణ్యదంపతులు) నవలలు. ఈ ప్రణయం

కఠినమైన సాంఘిక నియతి కాదు; అర్థనారీశ్వర తత్వముతో భార్యాభర్తలు ఒకరినొకరు

ఎడబాయక జమిలిగా అవధులు లేని మానసిక శారీరిక రసానుభూతిని పొందటానికై

సాధన చేసే ప్రక్రియ. అచ్చమైన దంపతులకు నిత్య సాహచర్యమే.

ఆయన అర్థం కాని మారుమూల పదాలు వాడతారని, శైలి, పలుకు పెళుసైనదని,

“పాషాణ పాక ప్రభువు” అని అనేక విమర్శలకు గురయ్యారు. అందుకే కామోసు-

“మాట దురుసు చేసినావు, చేసితి మనసు మెత్తనగ

బాట తప్పించి బ్రతుకు, పుట్టెడు ప్రతిభ నిచ్చితివి

కోటి శత్రులు గూర్చినావు, కూర్చుండి గుండియలోన

నాటగ నందమూర్నిలయ విశ్వేశ్వరా కులస్వామి!” అంటూ చలించక మొక్కవోని ఆత్మ

విశ్వాసంతో ముందుకు సాగారు.

మన అందరి గుండెల్లోనూ భగవంతుని మీద మోహము విరహమై లోలోపల కలచి

వేస్తూ ఎరుక లేని మనలను తెలియరాని దుఃఖవివశులను చేస్తుంది. విశ్వనాథ ఆ

దుఃఖాన్నే జీవుని వేదనగా భావించి కావ్య వస్తువును చేసుకున్నారు. ఆయనకు

లోకమంటే విపరీతమైన ప్రేమ. పర్యవసానంగా లోకుల బాధలను తట్టుకోలేని సున్నిత

మనస్తత్వము. బహుశా అందుకేనేమో ఆయన రచనలన్నిటిలోనూ ఒక విస్తృతమైన

దుఃఖరేఖ స్పష్టంగా గోచరమవుతుంది. రామాయణ కల్పవృక్షములో ఆయన

ప్రతిపాదించిన జీవుని వేదన భవభూతి చెప్పిన “ఏకోరసః కరుణయేవ” అనే భావానికి

చాలా దగ్గరగా ఉంటుంది.

నిన్నెవరు మెచ్చుకొందు రీ నేలయందు

పలుకు పెళుసైన యట్టి నిర్భాగ్య కవిని

కలిత లౌకిక సాంసారిక ప్రగాఢ

దుఃఖ దూషిత వాంఛావిధూతమతిని

(కవి దుఃఖం ఖండిక)

అత్యంత ప్రతిభ, విశేష విద్వత్తు ఉన్నవారికి ఆత్మవిశ్వాసము సహజంగానే

ఎక్కువగా ఉండి, అహంకారములా భాసిస్తుంది. ఆయనే స్వయంగా “నేను గర్విష్ఠిని,

అహంకారిని”."నాలో లోపలి భావన - నేనొక గొప్ప కవి, నాకు ఎదుగుదల కలదు.

ఇంతకు పూర్వము నేను వ్రాసిన పుస్తకములు సరిగా అర్ధము చేసుకోలేదు. కారణము -

ఆ గ్రంథములందలి సొగసులు సరిగా గ్రహించక పోవడమే"అని అన్నారు.

ఆయనకు విరోధుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, అభిమానులూ ఎక్కువవుతున్నారు. ఆయన రచనల పై వచ్చినన్ని పుస్తకాలు, జరిగినన్ని చర్చలు,జరుగుతున్న రభసలు మరే ఇతర సాహితీవేత్తల విషయంలోనూ కానరావు.

ఇది ప్రతిన పూనితిని ప్రవహింప జేతు

నీ అడుగు దమ్ములందు అనేక నాక

వాహినులు వాని నీరముల్ ప్రాశనమ్ము

గాగ భావ్యాంధ్రదేశ సత్కవులకెల్ల

(గిరికుమారుని ప్రేమ గీతాలు )

ఇదీ ఆయనకు తన ప్రతిభ మీద ఉన్న విశ్వాసము.

మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు విశ్వనాథ వారిని “లోకం పట్టని కవి” అని వర్ణిస్తే, శ్రీశ్రీ

“నిన్నటి నన్నయ్య భట్టు” “ఈనాటి కవి సమ్రాట్టు” “తెలుగువారి గోల్డు నిబ్బు” “తెలుగువారి

ఆస్తి” అని ప్రశంసించారు.“తన జాతికి, సంస్కృతికి, తన చరిత్రకు, భాషకు, సారస్వతానికి ప్రతినిధిగా నిలిచితన దేశ వైశిష్ట్యాన్ని, ఆ జాతి లక్షణాలను తన రచనలలో ప్రతిబింబింపజేసి సృష్టినంతటినివ్యాకరించగలిగే వాడే మహాకవి. దీనికి సరియైన నిర్వచనం కళాప్రపూర్ణ డాక్టర్ విశ్వనాథసత్యనారాయణ.” - డాక్టర్ ధూళిపాళ శ్రీరామమూర్తి

విశ్వనాథ వారి విస్తార వాఙ్మయము భారతీయ సనాతన ధార్మికవిలువల పరిరక్షణ

అంతసూత్రంగా సాగిన రచనా సముదాయము. ఆయన రచనలు చదివితే కలిగే అనుభూతి

భాషా సౌలభ్యము కన్నా ఎన్నో రెట్లు గొప్పది. ఒక మహాకవి పుస్తకాన్ని అర్థము

చేసుకోవాలంటే ఆయన రచనలను పదేపదే చదువుతూ ఉండాలి. అర్థం కాకపోయినా

అర్థమయ్యేవరకు చదువుతూనే ఉండాలి. అప్పుడే ఆ రచనకి లక్ష్యసిద్ధి, ఆ కవికి

ఆత్మసంతృప్తి.


సుందరి వేణుగోపాల్, హైదరాబాద్

13/11/2023


విశ్వనాథ సత్యనారాయణ గారి పట్ల నాకున్నది భక్తితో పాటు అపారమైన గౌరవము. ఆయన వంటి మహాకవినిురించి తెలుసుకోవడము, వారి రచనలను చదవగలగడం ఎన్నో జన్మల సుకృతంగా భావిస్తున్నాను. విశ్వనాథవారి పుస్తకాల మీద లభ్యమైన అనేక వివరాలు అంతర్జాలంలో చదవడం మూలంగా, వారి గురించిన ప్రముఖులఇంటర్వ్యూలు చూడడం వలన, వారి గురించి ఎంత చదివినా కొండంత ఆయన ప్రతిభను తెలుసుకోవడం,తెలియచేయడం అన్నది సూర్యుడి తీవ్ర ప్రకాశాన్ని గుప్పిటలో పట్టుకోవాలనుకోవడమనే దురాశ అన్నతెలివిడి కలిగి ఉన్నాను.

శ్రీవాగ్దేవీ కళాపీఠంవారు నిర్వహిస్తున్నఅంతర్జాతీయ అంతర్జాల పరిశోధనాత్మక వ్యాసరచన October 2023పోటీలలో పాల్గొనే అవకాశం వచ్చినందున ధైర్యం చేసి వారి సాహిత్యము గురించి నాకర్థమైన మేరలో వ్రాసాను.తప్పులు ఉంటే అవి కేవలం నా అవగాహనలో లోపమే కానీ మరొకటి కాదు.

శ్రీవాగ్దేవీ కళాపీఠం వారికి కృతజ్ఞలు.

ఈ వ్యాస రచనలో నాకు మార్గదర్శనం చేసిన గ్రంధాలు

1.విశ్వనాథధిషణాహేల - డా. గుమ్మలూరి ఇందిర

2. కల్పవృక్షంలో కాంతామణులు - డా. గుమ్మలూరి ఇందిర

3. రస రాజధాని 120 యేండ్ల విశ్వనాథకు సాహిత్య నీరాజనం - ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య

4. A rare interview of Viswanatha Satyanarayana - R.S .Raman

అపురూపమైన ముఖాముఖి- రావెల సాంబశివ రావు

5. వేయిపడగలు నేడు చదివితే- కల్లూరి భాస్కరం

6. రామాయణ కల్పవృక్ష రామణీయము- డాక్టర్ ధూళిపాళ శ్రీరామమూర్తి

 
 
 

Recent Posts

See All
శ్రీశ్రీ

శ్రీశ్రీ చదువుకునే రోజుల్లో నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన ఆ మహానుభావుడి మీద భక్తితో, గౌరవంతో సమర్పిస్తున్న చిన్న నివాళి ఇది. "మింటనెచటనో...

 
 
 

Comentarios


Post: Blog2_Post
  • Facebook
  • Twitter
  • LinkedIn

©2020 by nenu meeru. Proudly created with Wix.com

bottom of page