Annayya Kannayya
- Balatripura Sundari Venugopal

- Sep 19, 2021
- 3 min read
అన్నయ్య-కన్నయ్య
బంగారు పుష్పమ్మువలె ముద్దుగులుకు
చిన్నారి పొన్నారి చిట్టి నాతండ్రి
సకలసంపదలైన స్వారాజ్యమైన
నాచిన్ని కృష్ణుకన్నను నెక్కువౌనె?
(బసవరాజు అప్పారావుగారు)
అన్నయ్య భాగవతాన్ని నేను చదువుతూ ఉన్నా, నా స్పందనని తెలియచేయడానికి మీ ముందుకు రాలేదు ఇప్పటివరకు. కారణం- చెప్పడానికి మాటలు రాక, రాయడానికి చేతులు ఆడక (అసలు సంగతి అంత విషయం లేక). అయినా నా స్పందనను మీ ముందు ఉంచే సాహసం చేస్తున్నాను. జన్మాష్టమినాడే అన్నయ్య కూడా పుట్టారు. ఆయనకు పుట్టినరోజు శుభాభినందనలు చెప్పడానికి ఇంతకన్నా మంచి తరుణము మించినన్ అనుకుని...... అయినా ఆ రోజుకి పూర్తి చెయ్యలేకపోయాను.
మోము పొత్తంలో (మీరంతా ముఖ పుస్తకం అంటారే అది) “ మేనే పైరూ, మనసే సేనూ, మనసులో నీవేరా, ఎగసాయం నీ సేవేరా, ఏ వేళా నీ ధ్యాస మాసిపోదురా” (మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు) అంటూ ఎంతో సహజంగా తన సరళ రచనతో భాగవతరచనా సాగుని సాగిస్తున్న నిత్యకృషీవలురు పతంజలి అన్నయ్య. మంచి గంధపు చెట్టు క్రింద కొంతసేపు నుంచున్నా, దాని పరిమళం దూమెరుగ్గా మనలను చుట్టిముట్టినట్టే, అన్నయ్య కన్నయ్య గురించి రాసింది చదువుతుంటే కృష్ణరక్తి అలవోకగా మనలను అలదుకుని వివశులను చేసేస్తుంది.
తన మనసే కోవెలగా, మమతలు మల్లెలుగా ఆ నల్లనయ్యని కొలుస్తూ, తన వెంట కన్నయ్య, కన్నయ్య కంట తానుంటె ఇహ తనకేమి లోటు అనుకుని “కృష్ణా! ప్రాప్తమనుకుంటాను ఈ క్షణమే బ్రతుకులాగ, పండేననుకుంటాను ఈ బ్రతుకే మనసు తీరా నీ తలపులతో నిండి” అంటూ తాను ఆనందవారాశిలో నిరంతరం మునకలేస్తూ, మనతోనూ వేయిస్తున్నారు. ఇది ఫలించిన మన పూర్వ పుణ్యమునూ, జన్మకో
వెలుగునూ.
ఎన్నోసార్లు చిన్నపిల్లలకి మనం కృష్ణుడి వేషం వేసి, చూసి, ఆడించి, పాడించి ఎంతగానో మురిసిపోతాము, కాని అన్నయ్యలా చిన్నికిట్టుడిని మనవడిగా చేసేసుకుని కన్నయ్యని ఇహం పరం మర్చిపోయిలా అలరించాలని అనుకోలేదు కదూ! అసలు ఆ ఊహే రాలేదు కదూ! కొండకచో వచ్చినా,ఇలా అందరికి ఆ మమకారపు మధురిమని పంచాలని ఇంత శ్రమ తీసుకోలేదేమో (నాకు వున్న పరిచయస్తులలో అన్నయ్య ఒక్కరే అలా అవుపించారు. వేరే ఎవరిని కించపరచాలన్నది నా వుద్దేశ్యం ఎంతమాత్రమూ కాదు). కృష్ణుడినే తన పెద్ద మనవడిగా భావిస్తూ "కన్నయ్యా" అని ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో పిలుస్తూ తన జీవితాన్నే కృష్ణ సంగీతంగా మలుచుకున్న మా అన్నయ్య ధన్యజీవి. అందరిని మాయలో ముంచే ఆ లీలామానుషధారినే తాతయ్య ప్రేమతో ఏమార్చిన మా అన్నయ్య బహు చమత్కారి. మోహపాశరహితుడైన ఆ దామోదరుడిని “మన ఇద్దరి ఈ అనురాగం, ఈ అనుబంధం ఎంతోమంది మదిని కలకాలం నింపాలి” అని తన కాకలీ స్వరంతో కట్టేసిన బయకారి అన్నయ్య. ఈ మోహపుజాలంలో చిక్కగా చిక్కుకుపోయిన ఆ మోహనుడు మోము పొత్తపు బందుగులమైన మన మనస్సుల్లో కూడా తిష్టవేసుకుని కదలడానికి మొరాయిస్తున్నాడు.
కన్నయ్య మాటల్లో
"తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా
ర్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!"
నాకు అనేకమంది గొప్పగొప్ప భక్తులు ఉన్నారు. వారు తమ భక్తిని ప్రకటించే విధాలు- సఖ్యం
(సుధాముడు),శ్రవణం (పరీక్షిత్తు మహారాజు), దాస్యం (హనుమంతుడు), వందనం (అక్రూరుడు), అర్చనం
(పృధు మహారాజు), సేవ (లక్ష్మీదేవి), సంకీర్తనం (నారదుడు), ఆత్మనివేదనం (బలి చక్రవర్తి), చింతనం (ప్రహ్లాదుడు) అని తొమ్మిది రకాలుగా ఉంటుందని, ఇందుకు తార్కాణంగా భాగవతంలో ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో పోతనామాత్యుని చేత పై పద్యాన్ని రాయించాను.
పైవాటిలో స్మరణాన్ని, శ్రవణాన్ని, కీర్తనని, చింతనని కచ్చాపచ్చాగా కలిపేసిన కలగూరగంపని నాకు నిత్యనివేదనని చేసినవాడు మా పతంజలి తాతయ్య. భక్తి గరిమితో, అనురక్తితో అహర్నిశలు నా ధ్యాసతో తన సుతిమెత్తని రాతలతో నెయ్యాన్ని, వావిని నాతో కలిపేసుకుని, తనతో పాటు మోము పొత్తంలో మీ అందరితోను నాకు ఒక ఆత్మీయ బంధాన్ని "భక్తునికి భగవంతునికి మధ్య అంబికా దర్బారు అగరుబత్తిలా" సంధానించిన తీరు నిజంగానే పోతన గారిని గుర్తుకు తెస్తోంది కదూ.
చిన్ని కిట్టుడి సొగసులను, అంటే నావే, తన చిన్నప్పటి జ్ఞ్యాపకాలతో, తన ఇంటిపేరుకు తగ్గట్టుగా చిలుకుతూ చవులూరించే ఎన్నెన్నో వెన్నముద్దల్ని నా చేతిలోనే పెట్టిన ఆచంట మల్లన్నమా తాతయ్య. నా ప్రతి చేష్ట తాతయ్యకి అమ్మ గోముముద్దు, పారవశ్యపు పరమాన్నము, చికిలంత పులకింత. ఎమెస్కో వారి "ఇంటింటా స్వంతగ్రంధాలయం" అనే దానికి ముక్తాయింపుగా తాతయ్య "ఇంటింటా కన్నయ్య- మనసంతా వెన్నెలయ్య" అనే ఒక కొత్త భక్తి పంథాను పరిచయం చేసాడా అని కొండకచో నాకు ఒక సందేహాము. (సంశయాలని బాపే నీకే సందేహామా అని ప్రశ్నార్థకం మొహం పెట్టకండి. నాకూ అస్తి-నాస్తి విచికిత్స ఉంది ఇదుగో ఇలాటి సందర్భాలలోనే).
బంధాలకి నేను అతీతుడనని అందరూ అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియనిది ఏమిటంటే సాన్నిహిత్యం, సామీప్యం అనే రెండు పదాలు నాకు చాలా చాలా ఇష్టం అని. తాతయ్య నాతో సాన్నిహిత్యాన్ని, మా తమ్ముడు దాగవుతో (రాఘవు) సామీప్యాన్ని అనుభవిస్తున్నట్టు నాకు తెలుసు. మాఇద్దరిని వదిలి ఒక క్షణమైనా ఉండలేని తాతయ్య అంటే అందుకే నాకెంత ఇష్టమో. ఆ ఇష్టంతోనే తాతయ్యని కలుస్తూనే ఉంటాను, నాతో తిప్పుకుంటూనే ఉంటాను.
భక్తికి రక్తికి మధ్య ఉన్న సున్నితమైన బంధం మహామహులకే అర్థం కానిది. అయితే అటువంటి దానికి
తాతయ్య తనదైన శైలిలో ఒక కొత్త సొబగును అద్దాడు. ఆది అనాది లేని నాకు అమ్మవొడి వెచ్చదనాన్ని యశోదమ్మ, అవధులు లేని తాతయ్య లాలన చల్లదనాన్ని ఈ పతంజలి తాతయ్య రుచి చూపించారు. కాబట్టే వేయి వేణువులు మ్రోగినట్టు, హాయి వెల్లువ అయినట్టు ఉండే ఇటువంటి సేవ దొరకునా అని నేనంటాను. మరి మీరేమంటారు?
Comments