ఉగాది పండుగ వైశిష్ట్యం
- Balatripura Sundari Venugopal

- Apr 5, 2022
- 1 min read
ప్రాచీన కాలంనుండి జరుపుకుంటున్న పండుగలలో ఉగాది పండుగకి విశిష్టత ఎక్కువ. చాంద్రమాస చైత్ర శుద్ధ పాడ్యమినాడే బ్రహ్మ సృష్టి ఆరంభమైంది అనే వరాహమిహిరుని సిద్దాంతాన్ని అనుసరించి ఈ రోజుని యుగాది లేక ఉగాది అనే పండుగగా జరుపుకుంటున్నాము.
తొలి ఋతువైన వసంతంలో తెలుగునెలల్లో మొట్టమొదటి నెలైన చైత్రములో మొట్టమొదటి రోజును సంవత్సరాదిగా ప్రాచీన కాలంనుండి తెలుగువారు జరుపుకుంటున్నారు. సంవత్సరములో మొదటి రోజుని ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ పండుగ సంవత్సర పర్యంతం మన జీవితాలు సుఖసంతోషాలతో శుభప్రదంగా గడిచిపోవాలనే ఆశకు నాంది.
ఉగాది పండుగ ఏదో దేవుడు లేదా దేవత అనుగ్రహం కోసం చేసే పూజో, వ్రతమో కాదు. కాలః కలయతా మహమ్ అని గీత. కాలం అన్నిటిని కలయవేసి, గణించి, ప్రేరేపించి కడతేర్చేది. ఆది అంతం లేని అటువంటి కాలాన్ని సంవత్సరరూపంలో గణించి సర్వదేవతాస్వరూపంగా భావించి ఆరాధించే పండుగ. సర్వాంతర్యామి ఐన భగవంతుడి కనుసన్నలలోనే కాలం నిరంతరం కదలాడుతూ ఉంటుంది కనుక పరమాత్మని సంవత్సరాత్మక రూపంతో ఆరాధించడము ఉగాది పండుగలోని అంతరార్ధం.
పంచాంగం పంచ భూత పంచ ప్రాణ పంచేంద్రియ పంచ తత్త్వాలకు సంకేతం. నిరాకరమైన కాలాన్ని భగవత్స్వరూపం అనే భావన చేసేవారికి ప్రతి నిమిషమూ పండుగే అని ఉగాది పండుగ నాటి పంచాంగ శ్రవణం మనకు బోధిస్తోంది. కాలాతీతుడు, కాలస్వరూపుడు ఐన భగవంతుడిని గణన చేసే పంచాంగ శ్రవణం మన జీవితాలు కష్టాల పాలు కాకుండా కాపాడే ఆయన కరుణాదృష్టి ప్రసరించడానికి అవసరమైన తరుణోపాయాలని సూచించే ఒక సాధనం.
అనుబంధాలు (తీపి), కుంగుబాట్లు (చేదు), సంఘర్షణలు (కారం), ప్రయాసలు (ఉప్పు), అనాలోచిత చర్యలు (వగరు), అందుకోలేని ఎత్తులు (పులుపు) వంటి షడ్రుచులతో కూడిన మన జీవితానికి ప్రతిరూపం ఉగాది పచ్చడి. ఉగాది నాడు తీపి ఆమ్ల చేదు కలసిన (బెల్లం,చింతపండు,వేపపువ్వుతో కూడిన) పచ్చడిని సేవించడం ఆ సంవత్సరంలో ఎదురయ్యే కష్టసుఖాలను ఎదుర్కొనేందుకు మనలను మానసికంగా సంసిద్ధం చేస్తుంది.
ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో విజయాలను, సంపదను, సంతృప్తిని సమృద్దిగా తీసుకురావాలని ఆశిస్తూ శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
సుందరి వేణుగోపాల్
Comments