కాకినాడలో దసరా జ్ఞాపకాలు
- Balatripura Sundari Venugopal
- Jan 8, 2021
- 2 min read
డెభైయవ దశకంలో మేము కాకినాడ జగన్నాథపురం లో ఉన్నమా అమ్మమ్మగారింటికి వచ్చేసాము. మల్లాది సత్యలింగ నాయకర్ గారు కట్టించిన బళ్ళో చేరాము. అది మా అందరి ఆస్థాన బడి. అంటే మా మావయ్యలు, పిన్నులు, మావయ్యల పిల్లలు అందరూ అక్కడే చదివేవారు. కాకినాడలో గడిపిన నా చిన్నతనపు రోజులు, జరుపుకున్న ప్రతి పండగా అనేక మధుర స్మృతులకు నెలవు. కానీ వాటిలో నాకు చాలా ఇష్టమైనవి దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు.
దసరా పండుగ సంబరాలు నాకు అనుకోకుండా దొరికి పెన్నిధి లాంటివి. వాటిలో ముఖ్యమైంది సూర్యారావు పేటలో పిండాల చెరువుకి ఎదురుగా ఉండే బాలాత్రిపుర సుందరి గుడిలో పూజ. ఆ గుడికి మా కాకినాడ ఆడపిల్లలకు అవినాభావ సంబంధం ఉంది. సాధారణంగా తొలి కానుపులో ఆడపిల్ల పుడితే ఆ తల్లి పేరే పెట్టేవారు. ఒకవేళ కుదరకపోతే తర్వాత పుట్టిన ఆడపిల్లలకి ఆవిడ పేరే పెట్టేవారు. శరన్నవరాత్రిళ్ళలో ప్రతి ఏడాది బాలాత్రిపుర సుందరి గుడిలో తాతయ్య సప్తమి నాడు (రక్తబీజాక్షుని వధ నాడు) పూజ చేయించేవారు. సహస్రనామార్చన, ఖడ్గమాలా స్త్రోత్రం, అభిషేకం అవి చాలా నిష్ఠగా చేసేవారు. కాకపొతే పైడితల్లి గారని ఆ పూజ చేసే ఆయన గిరజాల జుట్టు, పెద్ద కుంకుమబొట్టు ఎర్ర పట్టుపంచతో కొంచం భయం వేసేలా ఉండేవారు. పగలంతా పెద్దలు ఉపవాసం ఉండి రాత్రి పూజ అయ్యాక అమ్మవారి ప్రసాదంతో ఉపవాసదీక్షని ముగించేవారు. పిల్లలం ఉండలేమని పొద్దుటే అన్నాలు పెట్టినా, రాత్రికి మాత్రం గుడిలో ప్రసాదమే మాకునూ భోజనం. దీపాలు పెట్టేవేళకి చక్కగా పట్టుపరికిణీలు, జడగంటలు,తల్లో చిట్టి చేమంతుల దండలతో బంగారు తల్లుల్లా ముస్తాబు అయ్యి గుడికి వెళ్లేవారం.
మా త్రిపుర సుందరి అమ్మవారి సౌందర్యం వర్ణించరానిది. ఆ తల్లి విగ్రహాన్ని ఎన్ని సార్లు చూసినా, ఎంత సేపు చూసినా తనివి తీరదు.మాములుగా దేవినవరాత్రళ్ళులో తల్లి ఉగ్రంగా ఉంటుంది అంటారు కదా, కానీ మా బాలాత్రిపురసుందరి అమ్మవారు ఎంతో శోభాయమానంగా, శాంతంగా, కరుణామూర్తిలా ఉండేది. గుడి చుట్టూ ప్రదక్షణలు, గుళ్లో అంతరాలయంలో కూచుని దర్శనానికి వచ్చే ఆడవారి అలంకరణలను ఎంతో ఆసక్తిగా చూసేవాళ్ళము. అంతసేపు కుదురుగా, మాట్లాడకుండా కూచోడం అంటే నాలాటి దానికి పెద్ద శిక్షే. కానీ అమ్మవారి పూజ అంటే కొంచం భయంగానే ఉండేది. పూజారిగారు హారతి అనగానే చెంగున లేచి నించుని శ్రద్హగా మంత్రపుష్పం విని భక్తిగా దండం పెట్టుకునేవాళ్ళము.ఉఛ్ఛస్వరంతో ఆయన శ్రీసూక్తం చదువుతుంటే వళ్ళంతా గగుర్పొడిచేది. ఆ తీర్ధం అమృతోపేయం. ప్రసాదంగా చిట్టి గారెలు నిమ్మరసంలో నానపెట్టిన అల్లం ముక్కలతో ఇచ్చేవారు. అవి తినగానే ఎదో తెలియని బలం వచ్చినట్టు ఉండేది. గర్భగుడికి కొంచం పక్కనే ఉన్న హాలులో భోజనాలు పెట్టేవారు.ఆ భోజనాలపైన అంతగా ఆసక్తి ఉండేది కాదు, వేళ తప్పిపోవడం, ప్రసాదం తినడం మూలంగా. పూజారిగారి ఆశీస్సులు అందుకుని, బాగా చదువుకోవాలని దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళేవాళ్ళము. ఎందుకంటే ఆరు నెలల పరీక్షలు దసరా శెలవుల తరువాతా ఉండేవి.
చిన్ననాట దసరా అంటే సరస్వతి గానసభ లో జరిగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలకి వెళ్లడం అనే ఇంకో మధురమైన స్మృతి. సాహిత్యం పైన, సంగీతం పైన ఆసక్తి కలగడానికి ఆ రోజులే కారణం. ప్రతి సంవత్సరం దసరాలకు సరస్వతి గాన సభలో అనేక సంగీత నృత్య కార్యక్రమాలు జరిగేవి. అమ్మమ్మతోనో , పిన్నితోనో వాటిని చూడడానికి వెళ్లడం నా పూర్వ జన్మ సుకృతమని ఇప్పుడు బాగా అర్థమవుతోంది. ఎంతమంది విఖ్యాత సంగీతకారుల, నాట్య వేత్తల ప్రదర్శనలు దర్శించి ధన్యురాలిని అయ్యానో. మచ్చుకి శ్రీమతి ఎమ్ ఎల్ వసంతకుమారి, శ్రీమతి మణిస్వామి, శ్రీ మధురై ఎన్ కృష్ణన్, శ్రీ నేదునూరి కృష్ణమూర్తి, శ్రీ మంగళంపల్లి బాలమురళి కృష్ణ, శ్రీ లాల్గుడి జయరాం (వయోలిన్) , శ్రీ ఎమ్ ఎస్ గోపాలకృష్ణన్ (వేణువు) , శ్రీ టీ ఆర్ మహాలింగం (వేణువు), శ్రీ చిట్టి బాబు (వీణ), శ్రీ ఈమని శంకర శాస్త్రి (వీణ) వంటి సంగీతకారులు, శ్రీమతి వింజమూరి సీత, అనసూయలు పాడిన జానపద గీతాలు , శ్రీమతి యామిని కృష్ణ మూర్తి, శ్రీమతి సుమతి కౌశల్, శ్రీమతి రత్నపాప, శ్రీవిద్య, వెన్నిరాడై నిర్మల వంటి నృత్తకారిణులు అబ్బో ఆ జాబితా ఎంత పెద్దదో. ఒకసారి పాండవ ఉద్యోగ విజయాలు నాటకానికి వెళ్లి, ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు అని ఎందుకు అంటారని తికమక పడ్డము ఒక చక్కటి జ్ఞాపకం. తిరుపతి వేంకట కవుల పద్యాలు, పీసపాటి వారు, షణ్ముఖ ఆంజనేయులు గారు వంటి ప్రతిభామూర్తుల నటన, అప్పుడు అంతగా తెలియక ఏదో మాములుగా చూశాము. కానీ ఇప్పుడు తెలుస్తోంది ఆ కళలు, ఆ కళాకారుల గొప్పతనం. అదొక బంగారు కాలం. ఆ రోజులను తల్చుకుని మళ్ళీ మురిసిపోడం ఇలా నలుగురితో పంచుకోవడం ఒక అదృష్టం. ఇంగువ చుట్టిన బట్టకు ఆ వాసన పోనట్టు, చిన్నతనంలో అలాటి అనుభవాలు నాలో పఠనాసక్తిని, సంగీతంపట్ల అనురక్తిని పెంచాయి.
దసరా పండుగ అంటే ఇప్పటికి నాకు అమితమైన ఇష్టం. చిన్ననాటి జ్ఞ్యాపకాలతో పాటు మా పిల్లల కోరిక మీద ప్రతి సంవత్సరం పెట్టుకునే బొమ్మలకొలువు నాలోని చిన్నతనాన్ని ఇంకా సజీవంగా ఉంచుతున్నందుకు.
Kommentare