కాశీనాథుని విశ్వనాథీయం
- Balatripura Sundari Venugopal

- Aug 18, 2023
- 3 min read
మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు పోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికల దూగు
రాయంచ చనునే తరంగిణులకు?
లలితా రసాల పల్లవ ఖాదియై సొక్కు
కోయిల జేరునే కుటజములకు - బమ్మెర పోతన
విశ్వనాధ్ గారి గురించి ఈ నా రచనకి ప్రేరణ వివిధ పత్రికలలో, అంతర్జాలంలో విశ్వనాధ్ వారిమీద వచ్చిన అనేక వ్యాసాలు, నాకు ఆయన సినిమాలపట్ల ఉన్న మహాఇష్టం. ఆయన గురించి మహామహులెందరో చెప్పారు, రాసారు. వారిముందు నేను ఎంత? ఇది కేవలం చంద్రునికో నూలుపోగు చందంగా నాకు ఆయన పట్ల ఉన్న భక్తి తో రాసింది. తప్పులుంటే పెద్ద మనసుతో మన్నించేయండి.
నాకు పూజ్యులైన ఇద్దరు విశ్వనాథులలో ప్రథములు శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు తెలుగు సాహిత్య వినీలాకాశంలో ప్రచండ సూర్యతేజం అయితే, మరొకరు శ్రీ కాశీనాథుని విశ్వనాధ్ గారు తెలుగు చలన చిత్రసీమ గగనాన పొద్దు పొడిచిన వన్నె తరగని వేగుచుక్క.
ఓంకారం ప్రాణనాడులకు స్పందననొసిగిన ఆదిప్రణవనాదం. ఈ సమస్త సృష్టి నాదంతోనే ఆరంభమైంది; ఈ సమస్త జగత్తు నాదాధీనం (శార్జగదేవుడు).
కాదేది కళకు అనర్హం. ఈ చరాచర జగత్తులో మార్పు అనేది అనివార్యమైన ఒక చలన ప్రక్రియ. దాని మూలంగానే మనం రోజూ ఉంటున్న లోకమే కొత్తగా, వింటున్న సంగీతం మరింత కర్ణపేయంగా,ఇష్టపడుతున్న వినోదాలు ఇంకా వినూత్నంగాను, అప్పటివరకు అనుభవించినవి సారవిహీనంగాను అనిపిస్తాయి. సినిమా కాసుల వ్యాపారమే అయినా, దానిని కళాత్మక కాన్వాస్ గా తీర్చిద్దిన అతి కొద్దిమంది దర్శకులలో విశ్వనాధ్ గారు ఒకరు. కమర్షియల్ లక్షణములు లేని లలిత కళలను కమర్షియల్ సినీ వ్యాపార మాధ్యమము ద్వారా ఎక్కడా రాజి పడకుండా మూస ధోరణలకి స్వస్తి చెప్పి, సంగీత సాహిత్య నాట్య కళల రసరమ్య గీతాలుగా తీశారు, అనేకవేలమందికి చేరువ చేశారు. భారతీయ ఆర్ష సనాతన సంస్కృతి పట్ల ఆయనకు గల భక్తిప్రపత్తులు మనందరికి మేలుకొలుపులు.
నిజాయితీ ఉన్న ఏదైనా ఒక అంశంతో ఒక సినిమాను తీస్తే, అది తప్పకుండా ప్రేక్షకులకు ఎక్కుతుందని బలంగా నమ్మిన దర్శకులు ఆయన. మనుషుల్లో విలువలను, మంచితనాన్ని అమితంగా నమ్మి వాటినే తన సినిమాలకు పెట్టుబడిగా చేసుకున్నమనీషి. సమకాలీన సామజిక సమస్యలపట్ల ఆయనకున్న అవగాహనను తనదైన పరిష్కార మార్గాల ద్వారా చూపించారు. ఆయన ప్రచారకుడు, సంఘ సంస్కర్త కాదు. కానీ తాను నమ్మినదాన్ని స్పస్టముగా చెప్పి దానికి రుజువుగా తన సినిమాలో పాత్రలను నిజాయితీగా నిబద్దతతో తీర్చిదిద్దారు. ఆయన సినిమాలలో పాత్రలు నేలవిడిచి సాము చెయ్యవు, పెద్ద పెద్ద ఉపాన్యాసాలు ఇవ్వవు. సంఘాన్ని ఉద్ధరిస్తున్నట్టు పోజులు పెట్టవు. శారీరిక మానసిక వైకల్యాలతో బాధపడే పాత్రలు తమ దురదృష్టానికి కృంగిపోక సంగీతమో, నాట్యమో, చిత్రలేఖనమో ఇలా ఏదో ఒక లలితకళను ఇష్టపడి, కష్టపడి, పట్టు సాధించి మనకు ఒక ప్రేరణను ఇస్తాయి. అంతేకాని నీరస ప్రవర్తనతో కడివెడు కన్నీళ్లు కార్చి మనలను దుర్బలులను చెయ్యవు. దురాశ, స్వార్థం, కీర్తికాంక్ష, అసూయాద్వేషాలతో రగిలిపోయే దుష్టపాత్రలకు సినిమాటిక్ గా కాక తనదైన శైలిలో గుణపాఠం చెప్తాయి. ఎక్కడా మితిమీరిన నటన ఉండదు. హాస్యం కూడా కథలో భాగంగా కలిసిపోయి, ఎబ్బెట్టుగా అతుకు పెట్టినట్టుగా ఉండక, మనలను అలరిస్తుంది. మన నిత్య జీవితంలో ఎదుటపడే బోలెడు భవసాగరాలను గురించి వివరంగా విప్పి చెప్పి, వాటిని ఇలా దాటవచ్చు అని తోవ చూపుతాయి.
ఆయనకు స్త్రీలపట్ల ఉన్న గౌరవభావం ఆయన సినిమాలలో స్త్రీ పాత్రలే చెపుతాయి. స్త్రీవాదం, లింగ వివక్షత, మగవారి దౌష్ట్యం ఇక చెల్లదు అని వేదికలెక్కి ఊకదంపుడు ఉపన్యాసాలు, అర్థం లేని నినాదాలు ఇవ్వవు. ఓర్పుతో నేర్పుతో, తమ ఆత్మాభిమానానికి విఘాతం కలగకుండా తమ సమస్యలను పరిష్కారించుకుంటాయి. దారి తప్పిన సంసారాలను,బంధాలను గాడిలో పెడతాయి. తమకున్న శక్తిని సరిగా అంచనా వేసుకుని, తమకున్న పరిమితులను అర్థం చేసుకుని, తమదైన బాణీలో లక్ష్యాన్ని చేరతాయి. ఆయన కథానాయికలు తమ వ్యక్తిత్వపు అందంతో ఆడతనానికి మేలిమి బంగారపు మెరుగులు అద్దిన అచ్చ తెలుగు ఆడపడుచులు .
ఆయన సినిమాలలో పిల్లలు ముది మాటలు, వయసుకు మించిన చేష్టలు చెయ్యరు. పసితనపు అమాయకత్వం, కొంచం గడుగ్గాయితనం అల్లరి చేష్టలతో మన పసితనపు మధురిమలు మళ్ళీ మనకు గుర్తుకు తెస్తారు. అలాగే అమ్మమ్మలు, బామ్మలు, తాతలు పంచిన ఆప్యాయతలు చిన్నతనాన మనం అనుభవించిన అమృత క్షణాల తీపిని గుర్తుకు తెచ్చి మనసును తడుపుతాయి. స్నేహం కోసం ఎంతైనా చేసే మిత్రుల పాత్రలు మనలను అసూయపడేలా చేస్తాయి.
సాధారణంగా కళాకారుల తపన, తృష్ణ వారు జీవించే పద్ధతిలోనూ, చుట్టూ ఉన్నవారి జీవితాలలో విలక్షణతను తమ కళల ద్వారా ముందు తరాల కోసం వారు పొందుపరచిన విధానంలోనూ వెల్లడి అవుతుంది. ఈ అభివ్యక్తీకరణ వలన వారు ఆరాధించే కళలు దీప్తివంతమై, వాటి ప్రభావం వల్ల అతి సాధారణమైన మన జీవితాలు కూడా రస స్ఫూర్తిని పొంది రంజితమవుతాయి. భావుకత, సౌందర్యపిపాస నిండిన అలాటి కళాకారుల జీవితాలను ఎంతో హృద్యంగా చితీకరించిన విశ్వనాధ్ సినిమాలు మన భావనామయ ప్రపంచంలో స్థల, కాలావధులకతీతంగా నిలుస్తాయి. ఆ భావన సాగినంత మేర సువాసనలు విరజిమ్ముతూ ఒక పరిమళ వీచిక. నిత్యమల్లెల జోల, సిరివెన్నెల నిండిన ఎదపైన సిరిమువ్వ సవ్వడి.
ఆయన సినిమాలలో నటరాజు భరత శాస్త్ర సంభరిత పదద్వయ చరితుడు, నిరత సుమధుర మంగళ గళుడు. గీత నృత్త నాద రాగలయాదులకు నెలవైన నటరాజు. ఝణన ఝణన నాదములో, ఆయన ఝుళిపించిన పాదంలో జగము జలదరిస్తుంది.
విశ్వనాధ్ వారికి శివుడు ఆరాధ్యదైవం. ఆయన పేరులోనే కాశీకి నాధుడైన విశ్వనాథుడున్నాడు. శివపూజకే పూచిన ఈ సిరిమువ్వ సంగీతం సాహిత్యం నాట్యం శివుని నయన త్రయ లాస్యం అని నమ్మి నాద వినోదము నాట్య విలాసము పరమసుఖము అంటూ తన చిత్రాలలో వాటికి పెద్ద పీట వేశారు. సామవేద రసగంగలో తానించి అద్వైత సిద్ధికోసం భావాల రాగాల తాళాల తేలి శ్రీ చరణ మందార మధుపమై వ్రాలి నిర్మల నిర్వాణం మధుధారలే గ్రోలి, దొరుకునా ఇటువంటి సేవ అని తాను పులకించిపోయి మనలను పునీతులను చేశారు.
వినోదం, సందేశం కలబోత ఆయన తీతలు (వంశీగారికి క్షమార్పణలతో). గర్భగుళ్ళో ఇష్టదైవాన్ని అభిషేకిస్తున్నంత పవిత్రత,అమ్మ నులివెచ్చని వొడిలో పాపాయి పొందే ప్రేమ లాలింపు, ప్రియసాగరసంగమానికై ఉరవళ్ళు త్రొక్కే గోదారమ్మ పరవశము ఆయన సినిమాలు చూసేక మనకు దొరికే పరమాన్నపు దొన్నెలు. అవి కళాఖండాలని అంటారే కానీ నిజానికవి కలకండ ముక్కలే.
విశ్వనాధ్ చిత్రాలలో పాటలు అచ్చ తెనుగు నుడికారానికి చిరునామాలు. ఒక వేటూరి ఒక బాలు ఒక సీతారామశాస్త్రి ఒక మహదేవన్ ఒక ఇళయరాజా వీళ్లందరికి సారధి స్థానంలో విశ్వనాథ్. ఇదీ మన తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం. ఎంతో ప్రతిభావ్యుత్పత్తులున్న ఈ మహా కళాకారులను తన కళాసృష్టిలో భాగస్వాములను చేసి, వారంతా కలసి కురిపించిన స్వాతివాన జల్లులో మన ఆత్మలను తానమాడించారు, మనలను చరితార్ధులను చేసారు.
శివుడికి పంచభూత తత్త్వ ప్రతీకలుగా ఐదు ముఖములు -సద్యోజాత (సృష్టి), వామదేవ (స్థితి), అఘోర (లయ), తత్పురుష (మాయ), ఈశాన (ముక్తి) ఉన్నాయని, వాటి ఆధారంగానే ఆయన భవుడు (జల) శర్వుడు లేదా శివుడు (పృథ్వి), పశుపతి (అగ్ని),ఈశ్వరుడు (వాయువు), భీముడు (ఆకాశం) అని పిలవబడతాడని జనశ్రుతి. అందుకే కాబోసు పంచభూతములు నీ ముఖపంచకం కాగా అన్నపాటను విన్నాక ఆ పంచముఖుడి అనుగ్రహ దృష్టులు పారిన కారణజన్ములే వీరు అని, స్వరం, పదం, ఇహం, పరం కలిపిన నాదామృతాన్ని దోసిళ్ళ కొద్దీ మనకందించారని నా నమ్మకం, విశ్వాసం.
నాద సదనా, శ్రుతిధనా నీ కొలువు కోరిన ఈ తనువు కోరినా కోరికేముంది నీ శ్రీ చరణ దివ్య సన్నిధి తప్ప అని ఆ మహాశివుడి సన్నిధిని చేరిన కాశీనాథుని విశ్వనాథ వారికి నమస్సుమాంజులు ఘటిస్తూ..........
సుందరి వేణుగోపాల్
30-05-23
Comments