top of page
Search

పెద్ద పరీక్షలు, వేసవికాలం శెలవులు

  • Writer: Balatripura Sundari Venugopal
    Balatripura Sundari Venugopal
  • Dec 16, 2022
  • 2 min read

చిన్నప్పటి వేసవికాలం శెలవుల కన్నా ఎందుకో నాకు శెలవుల ముందు రాసిన పెద్ద పరీక్షల జ్ఞ్యాపకాలు చాలా బాగా గుర్తున్నాయి. సాధారణముగా మార్చి నెలాఖరువరకు ఒంటిపూట బళ్ళు ఉండేవి. పొద్దుటే చద్దిఅన్నంలో పెరుగులో ఆవకాయ ముక్కని నంజుకొంటూ తిన్నరుచి గుర్తుకు వచ్చి ఇప్పటికీ నోటిలోనూ, కంట్లోనూ చెమ్మే…… బడికి స్నేహితురాళ్ళ భుజాలమీద చేతులు వేసుకుని వెళుతూ పెద్ద పరీక్షల గురించి, వాటిలో వస్తాయనుకుంటున్న ప్రశ్నల గురించి ఎడతెగని చర్చలు… సరిగా రాయకపోతే మనం ఎంతగానో యిష్టపడే టీచర్ల దగ్గర మన ఇమేజికి జరిగే డామేజీని తలుచుకుని కొండంత దిగులు. ఈసారీ మొదట మూడు స్థానాలలో ఉంటామా ఉండమా అనే అనిశ్చింత. ఉండకపోతే అమ్మ చేతి తాయిలాల ఘాటు, నాన్న సుతిమెత్తని విసుర్లు తలుచుకుని కునారిల్లి పోవడం. జానపద సినిమాల్లో బవిరిగడ్డం మాంత్రికుడులా మనకి దక్కనిది ఎక్కడ వేరేవాళ్లకి దొరికిపోతుందనే దుగ్ధతో, ఆక్రోశంతో వాళ్ళని మన ఆగర్భ శత్రువుల్లా చూడ్డం. ఇప్పుడు తలుచుకుంటే కొంచం సిగ్గేస్తుంది, నవ్వూ వస్తుంది, దూరమైపోయిన ఆ అమాయకపు గడుసుతనం గుబులు పుట్టిస్తుంది……

పెద్ద పరీక్షలు తేదీ చెప్పగానే ఇహ పడే హడావుడి, ఆడపెళ్ళివారిల్లులా, ఇంతా అంతా కాదు… అప్పటివరకు అన్ని సరిగానే ఉన్నట్టుగా నమ్మి, నమ్మించి, తీరా పరీక్షలు ముందు పెన్నులు రాయడంలేదని, పాళీలు విరిగిపోయాయని, ఇంకు బుడ్డి కారిపోతోందని, జామెట్రీ బాక్స్ తుప్పు పట్టిందని సెకండ్ హ్యాండివి (అంటే మన అక్కలో అన్నలో వాడినవి) ఇస్తే ఇలాగే అవుతుందని, వృత్తలేఖిని మొన సూదిగా లేదని, రాయడానికి కొత్త అట్ఠ స్టీల్ క్లిప్పులు ఉన్నది మాత్రమే కొనాలని, పరీక్షలో అగ్రస్థానానికి చదివినదానికన్నా అదే ముఖ్యమైన సూత్రధారని, నటరాజు పెన్సిళ్లు కంటే కేమెల్ బ్రాండ్ వాడితేనే జామేట్రీ పరీక్షలో మార్కులు బాగా వస్తాయని, ఒకవేళ ఇవి కొనకపోతే దానిమూలంగా మార్కులు రాకపోతే ఎంత మాత్రము తిట్టకూడదని, తమ్ముడు నా లెక్కల నోట్స్ లో ఇంపార్టెంట్ గుర్తులు పెట్టుకున్న పేజీలతో రాకెట్లు చేసుకున్నాడని, ఒకటేమిటి ఇంట్లోవాళ్ళకి బీపీలు పెంచి, చిర్రెక్కించి చివాట్లు, మొట్టికాయలు తినడం అదంతా ఇప్పటి టీవీ సీరియళ్లకు సరిపడేంత మసాలా…..

తెల్లారగట్టే లేచి మండువాలో అమ్మ తోడుగా చదువుకోవడం, పాఠాలను అప్పచెప్పించుకోవడానికి తమ్ముడికి తాయిలాల ఆశ చూపించడం, స్నేహితులతో చర్చలు, ఈ చర్చలు మనకు పడనివాళ్ళకి తెలిస్తే వాళ్ళకి మనకన్నా ఎక్కువ మార్కులు వచ్చేస్తే మన ఆబోరు దక్కదనే కుళ్ళుబోతుతనంతో వాళ్ళను తప్పించుకు తిరగడం….నాన్న నన్ను దగ్గర కూచోపెట్టుకుని అరటిపండు వొలిచినంత తేలికగా లెక్కలు వివరించి ఇవి ఇంపార్టెంట్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కొన్ని టిక్ చేసి ఇవ్వడం, ఇస్తూ ఫస్ట్ మార్క్ నీకే రావాలని అన్యాపదేశంగా హెచ్చరించడం…. వీధి ఆ చివరి ఆంజనేయస్వామికి వీర మొక్కులు, ఈ చివర వినాయకుడికి గుంజీళ్లు లంచం, పరీక్ష పేపర్ ఇవ్వగానే కళ్ళు మూసుకుని ఇష్టదైవ ప్రార్థన (ఒకళ్ళా, ఇద్దరా) ఎంతకీ కళ్ళు తెరవకపోతే, పాపం చదువుకుని అలసిపోయి నిద్రకు ఆగలేకపోయామని ఇన్విజిలేటర్ల జాలితో కూడిన మేలుకొలుపులు, మందలింపులు….పేపర్ చూడగానే ఒక్క క్షణం ఏమి గుర్తుకు రాక కంగారు, తరువాత ఎవరో వెంట తరుముతున్నట్టు చక చకా రాసేయడం కన్నా గీకేయడం, టైం కన్నా ముందే ఇచ్చేసి బయటకు ఒకటే పరుగు… అక్కడ ఎంతకూ పరీక్ష హాలు నుంచి రాని స్నేహితుల కోసం పడిగాపులు, విసుగులు, పరీక్ష ఎలా రాసామో ఆరాలు, మాలో మేమే మార్కులు ఇచ్చేసుకోవడాలు, ఇంపార్టెంట్ ప్రశ్నలు అని చెప్పిన స్నేహితులను, ఖర్మ కాలి అందులో ఏది రాకపోయినా, అష్టోత్తరం సహస్రాలతో దీవించడం……

ఇహ ఆఖరి పరీక్ష రోజున చూడాలి ఆ విషాద సన్నివేశాలని…ఇష్టమైన టీచర్ క్లాస్ నుంచి వేరే టీచర్ దగ్గర చదువుకోవాలని, ఆయన /ఆమె చాలా చాలా స్ట్రిక్ట్ అని వాళ్ళకి జాలి, దయ, కరుణ, ప్రేమ అంటే అసలు తెలియదని, మా సీనియర్స్ నుంచి విన్నదానికి, మరిన్ని రంగుల మసాలాల సొబగులు అద్దడం….బదలీ అయి వేరే ఊళ్ళు వెళ్ళిపోతున్నవాళ్లని పట్టుకుని కంటికి మింటికి ధారగా ఒకటే ఏడవడం, అడ్రసులు తీసుకోవడం, చేతిలో చెయ్యేసి బాసలు చేసుకోవడం, నెమలీకలు, సిగరెట్టు పెట్టి ముచ్చిరేకులు, మరీ ఇష్టమైతే అచ్చివచ్చిన పెన్ను బహుమానంగా ఇవ్వడం ఇంకా కళ్ళకి కట్టినట్టు ఉంది…….

ఇలా కొండవీటి చేంతాడు లాంటి జ్ఞ్యాపకాలు…. ఆ చేజారిపోయిన మధుర క్షణాలను మళ్లీ తెచ్చుకోగలమా? ఎందుకో దేవుడు ఎదురై ఏదైనా కోరుకో అంటే ఒక్కటే వేడుకోవాలనిపిస్తుంది. ఇలాటి తీయని స్మృతులను పంచుకొనే స్నేహితులతో ఆ ఆనందానుభూతులను మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఆ అమాయకమైన చిన్నతనపు రోజుల కలిమికి, ఆ సంతృప్తికి దూరం చెయ్యొద్దని………


చిన్నప్పటి ఆనందాలు చిగురించిన మందారాలు (ఆరుద్ర)


సుందరి వేణుగోపాల్

 
 
 

Recent Posts

See All
శ్రీశ్రీ

శ్రీశ్రీ చదువుకునే రోజుల్లో నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన ఆ మహానుభావుడి మీద భక్తితో, గౌరవంతో సమర్పిస్తున్న చిన్న నివాళి ఇది. "మింటనెచటనో...

 
 
 
విశ్వనాథ సాహిత్య దర్శనము

మనము చదివే కొన్ని రచనలకు వయసుతో పాటుగా వచ్చే పరిణితి, జీవితానుభావాలు, నిశితమవుతున్న అవగాహన, పెరుగుతున్న లోక జ్ఞానం మొదలైనవి ఏదో ఒక...

 
 
 

Comments


Post: Blog2_Post
  • Facebook
  • Twitter
  • LinkedIn

©2020 by nenu meeru. Proudly created with Wix.com

bottom of page