బాపుట
- Balatripura Sundari Venugopal
- Dec 15, 2020
- 2 min read
ప్రముఖ చిత్రకారులు, చలనచిత్ర దర్శకులు, శ్రీరామ భక్తులు, అయిన బాపు అనబడే శ్రీ సత్తిరాజుల లక్ష్మీనారాయణ గారి గురించి చెప్పడానికి ఒక మహాసముద్రం అంత విషయం ఉన్నా, చెప్పే అంత అర్హత నాకు లేకపోయినా, ఆయన మా తెలుగువాడే అని చెప్పుకునే అహంకారం ఉంది ఎందుకు అంటే ఆయనంటే అంత మమకారం, ప్రేమ, భక్తి, గౌరవం. చిన్నప్పటినుంచి ఆయన బొమ్మలు చూసి, పెరిగిన తరం కాబట్టి. అలా ఆయన వేసిన బొమ్మలను సేకరించి, దాచుకుని ఇల్లంతా నింపేసుకున్న తరం కాబట్టి. మా డిగ్రీ ఆఖరి సంవత్సరం లో రంపచోడవరం విహారయాత్రకి వెళ్ళిప్పుడు, ఆయన కలియుగరావణాసురుడు సినిమా షూటింగ్ నిమిత్తం అక్కడికి రెండు మైళ్ళ దూరం లోనే ఉన్నారని తెలిసి , అందరి కళ్ళు కప్పి ఎంతో ఆత్రుతతో షూటింగ్ స్పాట్ కి మరో స్నేహితురాలితో వెళ్లి ఆయనను కలవడం నా జీవితంలో ఒక మహా అదృష్టం. కాకపోతే షూటింగ్ నడుస్తున్నా లెక్క చేయకుండా వెళ్ళిపోయి ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆటోగ్రాఫ్ ఆడిగేసరికి, ఆయన కోపంగా వేసిన కేకలు తలచుకుంటే ఇప్పటికి వణుకు పుట్టిస్తాయి. ఎంతో అభిమానంగా వెడితే, అందులోనూ ఆడపిల్లలము, అని ఉడుకుమొత్తనం వచ్చి ఏదో అనబోతుంటే, ముళ్ళపూడి రమణ గారు రసాభాస కాకుండా, మా ఇద్దరిని కొంచం పక్కకు తీసుకు వెళ్లి చాలా చక్కగా చెప్పారు. అభిమానం ఉంటే మా పుస్తకాలు చదవండి, చర్చిచండి. మేము తీసిన, తీస్తున్న సినిమాలు చూడండి. వ్యక్తిగత ఆరాధనలు మాకు ఇష్టం లేనివి, కష్టం కలిగించేవి. బాపుకు పని ముందు ఏదీ పట్టదు. చచ్చే అంత ఏకాగ్రత తో ఉంటాడు. అతను గీసిన బొమ్మల ముక్కులా అతని ముక్కు ఉండకపోయినా బోలెడు కుంచెం కోపం ఆ ముక్క చివర ఉంటుంది. మీరు చేసిన పనికి అతని ఏకాగ్రత కొంచం తగ్గి అతని కోపం స్థాయి పెరిగింది. ఇహ మీరు ఇక్కడ నుంచి వెళ్ళితేనే మంచిది. లేదా మేము pack off చెప్పాలి అని అనేసరికి మాకు ఏమి మాట్లాడాలో తెలియక (హనుమంతుడి ముందు కుప్పిగంతులా) నిరాశగా వెళ్లిపోయాము, వ్రతం చెడ్డా ఫలం దక్కలేదని అని వాపోతూ. కాంప్ కెళ్లకా అక్కడా సహస్రనామార్చన జరిపించుకున్నాము. ఈ సోది అంతకూ కొస మెరుపు చాలా సంవత్సరాల తరువాత మేము ఉద్యోగరీత్యా ముంబై లో ఉన్నప్పుడు,ఒకసారి ఆయన పుట్టినరోజుకు ఉత్తరం ద్వారా గ్రీటింగ్స్ పంపాను. జవాబు వస్తుంది అని ఆశించలేదు. మరుసటి సంవత్సరం ఆయన పుట్టినరోజున ఫోన్ చేసి (గుండెలు గుప్పిట్లో పెట్టుకుని) ఆయన కి శుభాకాంక్షలు చెప్పాను. ముక్తసరిగా థాంక్స్ అండి అని పెట్టేయబోయారు. కోతి బుద్ధి ఉరుకోదు కదూ ఉత్తరం సంగతి, డిగ్రీ అనుభవం చెప్పాను. ఉత్తరం అందింది అని చెప్పారు. ఆయన ముఖకవళికలు తెలిసే ఆస్కారం లేదని నా ధీమా. ఓపికగా విన్నారో, విన్నట్టుగా నటించారో తెలిసే వీలు కూడా లేదు కదా. ఆయన అప్పుడు అది కరెక్ట్ అని చెప్పి ఫోన్ పెట్టేసారు. అలా ఆయన్ని నాలుగు ఐదు సంవత్సరాలు ఫోన్ చేసి wish చేసి ఆ ఆనందాన్ని మూటకట్టుకున్న అదృష్టశాలిని.
అంతే కాదు మా పెద్దబ్బాయి పెళ్లికి పెళ్ళిపుస్తకం చేస్తూ , బుడుగు, సీగాన పెసూనాంబ బొమ్మలు పెట్టి రాసిన comment మా తమ్ముడు కాకినాడ ఆయన ఎందుకో వస్తే చూపిస్తే, ముసిముసి నవ్వులు చిందించి, సంతకం చేసి ఇచ్చారు. ప్రతి ఏటా
ఇలా ఆయన పుట్టినరోజు వంకతో ఈ అనుభవాల వీరబాదుడు వ్రతాన్ని ఇంతవరకూ చేస్తూ వచ్చాను.
Comments