మా చిన్ననాటి దసరా ముచ్చట్లు.
- Balatripura Sundari Venugopal

- Dec 15, 2020
- 3 min read
చిన్నప్పటి పండుగ సంబరాలు, జ్ఞ్యాపకాలు మనకు వెలలేని నిధులు, మరపురాని మధుర గీతాలు.
మా వూరు అటు బస్తీ కాదు ఇటు పల్లె కాదు. కాకినాడకు దగ్గరలో ఉన్న రామచంద్రపురం. చాలా అందమైన వూరు. గణపతి నవరాత్రుల సంబరాలు మరవక ముందే దేవి నవరాత్రులు మొదలైపోయేవి. ఈ పండగంటే కొంచం మనసులో భయం ఉండేది. అమ్మవారు ఉగ్రస్వరూపుణి గా పూజింపబడుతుంది కదా అందుకని. బడికి మూడు నెలల పరీక్షల తర్వాత దసరా శెలవులు ఇచ్చేవారు. బడి మూసే ముందే మా చేత గిలకలు, విల్లమ్ములు చేయించేవారు. రంగు రంగు కాయితాలతో కొబ్బరి ఈనె పుల్లలతో, కొంచం స్తొమత ఉన్నవారు వెదురు బద్దల తోనూ, బాణాలు , విల్లెలు చేసుకునేవాళ్ళము. బాణాలకి చివర మైదా పిండిని ఉడికించి కానీ చింతపండు ముద్దను కానీ పెట్టి మట్టిలో పొర్లించేవాళ్ళము బాణాలు ఆ బరువుకి బాగా వెడతాయని. నా బాణల దెబ్బలకి బాగా బలైంది మా తమ్ముడు, నాన్ననూ.
చిన్నపిల్లలను బళ్ళో వెయ్యడానికి విజయదశమి మంచిదని ఆ రోజు అక్షరాభ్యాసం చేసి లాంఛనంగా బళ్లోకి తీసుకుకు వచ్చేవారు. పలకలు బలపాలు పంచిపెట్టేవారు. విజయదశమి నాడు మా మాస్టార్లు అందరూ మా పిల్లలనందరిని పోగేసుకుని ఇంటిఇంటికి తిప్పేవారు. మేమూ గిలకలు, బాణాలు తీసుకుని
పావలా బేడైతే పట్టేది లేదు, అర్ధరూపాయిస్తే అంటేది లేదు,ముప్పావలా యిస్తే ముట్టేది లేదు,రూపాయి యిస్తేను ప్రాపకము లేదు,హెచ్చు వరహా యిస్తేను పుచ్చుకుంటాము
పై పావలాకు పప్పు బెల్లాలు తెప్పించి కట్నంబు లిప్పించరయ్య
అయ్యవారికి చాలు అయిదు వరహాలు,చిన్నవారికి చాలు సిరిశెనగ పప్పు,
పిల్లవాండ్రకు చాలు పప్పుబెల్లాలు.శీఘ్రముగా పంపుడీ శ్రీమంతులార
జయ విజయీ భవ II దిగ్విజయీ భవ II
(పూర్తి పాటను స్థలాభావం వల్ల ఇవ్వలేదు )
అని పాడుతూ ఇంటింటికి తిరుగుతూ పప్పు బెల్లాలు, డబ్బులు దండుకుని డబ్బుల్ని మాస్టర్లకి ఇచ్చేసేవాళ్ళము. వాళ్ళు వాటిని తమ స్వంతానికి వాడుకునేవారు కాదు. వాటితో మంచి మంచి కథల పుస్తకాలు కొని పోటీలు పెట్టి మాకే ఇచ్చేవారు.
ప్రతీరోజూ మెయిన్ రోడ్ మీద వేసిన తాటాకు పందిరిలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహం చూడడానికి ఒకటే హడావుడి పడిపోయేవాళ్ళము. మా వూరు అంతటికి ఒక్కటే పందిరి. ఆ అమ్మవారి విగ్రహం ఎంత కళకళ లాడుతూ ఉండేదో. అసలు ఆ విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు మాకు ఒకటే ఆతురత . వాళ్ళని నిలవనిచ్చేవాళ్ళము కాదు ఎప్పుడు అవుతుందాఅని. చివరాఖరికి వాళ్ళు మా పెద్దవాళ్ళకి మొర పెట్టుకునేవాళ్ళు. అప్పుడు కానీ ఊరుకునే వాళ్ళం కాదు. అమ్మది ఒక్కటే బ్రహ్మస్త్రం శెలవుల్లో ఇంట్లోనే వుండవలసి వస్తుందని. అంతే.
తొమ్మిది రోజు లూ అమ్మా వాళ్లంతా ఏదో ఒక తీపి వంటకం చేసి అమ్మవారికి నివేదన చేసేవారు. బడికి శెలవులు కాబట్టి మేమూ శివాలయంకి వెళ్లి (అది మా ఊరి మున్సిపల్ పార్క్ కి ఎదురుగ ఉండేది) పూజారి గారి చెల్లెళ్ళు సుభద్ర, లక్ష్మి (ఇంకో ఇద్దరిపేర్లు గుర్తుకు రావడం లేదు) కలసి ఆడుకునేవాళ్ళము. మేము గన్నేరు, మందార, నంది వర్థనం పువ్వులు ఏరి ఆయన కి ఇచ్చి అమ్మవారికి పెట్టమని ఇచ్చేవాళ్ళము. ఆయన ఎంత బాగా అలంకరించేవారో ఆ గుడి ప్రాంగణంలోనే పెద్ద గరుడవర్ధనం, మారేడు చెట్లు ఉండేవి. ఆయన మహా నివేదన చేసే దాకా ఆగి , దగ్గరుండి తలుపులు మూయించి కానీ కదిలేవాళ్ళము కాదు.
ఇంక సాయంకాలం గబగబా తయారయ్యి పోయి నేను, దువ్వూరి వారి శారద, వాళ్ళ బాబాయిగారి అమ్మాయిలు పద్మజ, లక్ష్మి, నారాయణమ్మ పందిరిలో తిరిగేవాళ్ళము. ఆ పందిరి దగ్గరే పాత బస్సు స్టాండ్ ఉండేది. అక్కడ ఉన్న చిన్న టీ స్టాల్ లో నుంచి లౌడ్ స్పీకర్ లో సినిమా పాటలు పెట్టేవారు. మా నాన్న అతనికి ఖాతాదారు కాబట్టి నేను కొంచం అథారిటీ చెలాయించి మా కిష్టమైన పాటలు పెట్టించేదాన్ని. పందిరిలో గాజులు, పూసల పేర్లు, రంగు రంగుల రిబ్బన్లు, ప్లాస్టిక్ పూలు, అటుకులు, మరమరాలు, వేయించిన శెనగ పప్పు రాశులుగా పోసి అమ్మేవారు. ఆడపిల్లలం కాబట్టి మాకు ఉత్తినేపెట్టేవారు. అవి తిన్నంత తిని ఆర్టోస్ వాళ్ళ కలర్ సోడాలు పంచుకుని తాగేవాళ్ళము. అక్కడ నుంచి యింక బొమ్మలకొలువు పేరంటాలకు పరుగులు. ఎన్నిసార్లు వెళ్ళేవాళ్ళమో తెలీదు. ఆ బొమ్మలు చూస్తూ, వర్ణించుకుంటూ, అక్కరలేని సలహాలు ఇచ్చేవాళ్ళము. చాలా రోజుల వరకు నేను బొమ్మలు పెట్టలేదు, ఆనవాయితీ ఉన్నా, కుదరని పరిస్థితుల వలన. కానీ దైవానుగ్రహం వలన, మా కుటుంబ సభ్యుల తోడ్పాటుతో సుమారుపాతికేళ్ల నుంచి బొమ్మల కొలువును పెట్టి నా చిన్నప్పటి సరదాను తీర్చుకుంటున్నాను.
రాత్రి ఏడు గంటలనుంచి శివాలయంలో దేవి భాగవతం పురాణం ఒక గంట చెప్పేవారు.
ఎనిమిదిన్నర నుంచి పందిరిలో రక రకాల వినోద కార్యక్రమాలు ఉండేవి. నాటకాలు, ఏకపాత్రాభినయనాలు, విచిత్ర వేషధారణ ఉండేవి. బట్టల కొట్లు వాళ్ళు, రైస్ మిల్లు ఓనర్స్, కార్లబ్బాయి గారు (ఆయన్ని ఎందుకు ఆలా అంటారో తెలీదు), రాజగోపాల్ సినిమా టాకీస్ వారు విరాళాలు ఇచ్చేవారు. అలా కోరాడ నరసింహం గారి శివ తాండవం ( ఆయనకు చాలా ఖ్యాతిని తెచ్చిన నృత్యం) భమిడిపాటి రాధాకృష్ణ గారి కీర్తి శేషులు నాటకం, ఆత్రేయ గారి ఎవరు దొంగ ? నాటిక చూసే అదృష్టం కలిగింది. ఆఖరి రోజున అంటే విజయదశమి నాడుసెవెన్ స్టార్ ఆర్కెస్ట్రా ( బసవరాజు ) తో పాటు ఒక జానపద చిత్ర రాజాన్ని చూపించేవారు.
పండుగ వెళ్లిపోయిన రెండు మూడు రోజుల వరకు దిగులు గా ఉండేది. ఏదో కోల్పోయినట్టు బెంగగా ఉండేది. కానీ మళ్ళీ దీపావళి సందడితో హుషారు వచ్చేది.
Comments