రంగమార్తాండ
- Balatripura Sundari Venugopal

- Aug 18, 2023
- 3 min read
"నాటకం యశస్సును కలిగించి ఆయుష్షును పెంచి, హితం కలిగించి, బుద్ధివికాసానికి కారణం అవుతుంది".
(భరత మహర్షి)
ఈ మధ్యనే చూసిన రంగమార్తాండ సినిమా గురించిన పొగడ్తలు, తెగడ్తలు కుప్పలు తెప్పలుగా చదివి, ఆ సినిమాను చూసాక నాకు కలిగిన ఫీలింగ్స్ మీతో పంచుకోవాలి అనిపించింది.
తెలుగు నాటకరంగంలో ఘనత వహించిన మహానుభావులు / రాళ్లు చాలామంది ఉన్నారు. వారందరి గురించి చెప్పాలంటే సాధ్యం కాదు కనుక సినిమా ఆరంభంలోని నాంది ప్రస్తావనలో ఎంపికచేసిన కొంతమంది గురించే సూచనప్రాయంగా చెప్పారు, వారి చిత్రాలనే చూపించారు. అంతవరకు బానే ఉంది. కాని తెలుగు నాటక రంగంలో అతి ప్రముఖమైన సురభి నాటక సంస్థ గురించి కాని, ఆ సంస్థ గొప్పతనం గురించి కాని, ఆ సంస్థ నుంచి వచ్చిన మహా నటులు, నటీమణుల పేర్లు కాని, వారి ఛాయాచిత్రాలు కాని ఎక్కడా లేవు. ఈనాటికి ఆ సంస్థని బ్రతికించడానికి వారు పడుతున్న పాట్లు గురించిన ప్రస్తావన లేశమాత్రమైన లేదు. ఇది ఎందుకు రాసానంటే ఈ సినిమా కథ అంతా ఒక నాటకరంగ పాత్రధారి చుట్టూ తిరుగుతుంది కాబట్టి.
ఈ సినిమాలో ఎక్కడా నాటకరంగంలో నటించిన స్త్రీల గురించి చెప్పకపోవడం చాలా విచారకరమైన విషయం. తొలితరం సినిమా నటలు, నటీమణులు నాటకరంగం నుంచే వచ్చారు. సాంఘిక కట్టుబాట్లను తీవ్రంగా పాటించే ఆ రోజులలో, అప్పటివరకు పురుషులే నటిస్తున్న ఆడపాత్రలను, ఇంటినుండి అనేక అడ్డంకులను దాటుకుని ఆడవారు బయటకు వచ్చి నటించడం అనేది అత్యంత గొప్ప సాహసం. అటువంటివారి గురించి చెప్పకపోవడం ఆ నటీమణులకు తీరని అన్యాయం చేసినట్టే. ఇదే కాదు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందంలతో నటించిన, కొండకచో, నటీమణుల ప్రసక్తి ఎక్కడా రాలేదు. అంటే వారు కేవలం పురుషులుకు మాత్రమే అన్నటువంటి నాటకాలలోనే వేషాలు వేశారా? మరి రావణాసురుడు దుర్యోధనుడు వంటి పాత్రలలో నటించినప్పుడు నాయికలు లేరా?
రంగ మార్తాండ అంటే రంగస్థలం మీద సూర్యుడిలా దేదీపమాన్యంగా వెలిగిపోయేవాడు అని కదా అర్థం. కాని అతను వెలిగిపోతున్న సూర్యుడు కాదు, వెలుగు అంతరించి పోతున్న సూర్యుడులా అనిపించేడు. కారణం అతని ప్రతిభ గురించిన సన్నివేశాలు కేవలం మాటలలోను, సంభాషణలలోను తప్ప, అదీ రెండు మూడు చోట్ల తప్ప, దృశ్యరూపంలో అంటే స్టేజి మీద అతను వేసిన పాత్రల బిట్స్ రూపంలో ఎక్కడా కనపడవు. అందుకే ఆ పాత్రకి గొప్పతనం ఆపాదింపబడినట్టు అనిపించింది కానీ నిజంగానే అతను ఎంతో ప్రతిభావంతుడైన నటుడు అన్నదానికి బలం చేకూరలేదు. ఇదివరలోనే నటనే జీవితం అనుకుని తన జీవితాన్ని పణంగా పెట్టిన రంగస్థల నటుడి పాత్రలతో అల్బెలా, నాటకాలరాయడు అనే చక్కటి అర్థవంతమైన సినిమాలు వచ్చాయి.
ఇందులో ప్రకాష్ రాజ్ పాత్రను, అతను నటించడం మానేసిన తరువాత తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన సవాళ్ళను ఎలా ఎదుర్కొన్నాడు ఆ క్రమంలో అతను పడిన (పెట్టిన?) మానసిక వేదన అనే పాయింట్ మీద మలిచారు. ఒక రంగంలో చాలా శ్రమ పడి ఎంతో పైకి వచ్చి పేరు ప్రతిస్టలు సంపాదించిన వ్యక్తికి సహజంగానే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కానీ అదే మితిమీరినప్పుడు అహంకారంగా మారుతుంది అని అనిపిస్తుంది. అతనికి పేరు తెచ్చిన పాత్రలను కొంచమైనా మనకి చూపించినట్లయితే ఆ అహం justify అయ్యేది. ఈ సినిమాలో మోతాదు మించిన అతని ఆత్మవిశ్వాసం ఒక్కోచోట అతను వేసిన ప్రతినాయకుల పాత్రల స్వభావ లక్షణాల ప్రభావానికి గురైనట్టు అనిపించింది. నటనే సర్వస్వం అనుకున్న అతను ఒక అకాడమీ లాటిది ఏర్పాటు చేసి దానిద్వారా శిక్షణను ఇచ్చినట్టు చూపించి ఉంటె అతను తనను పెంచి పెద్ద చేసిన ఆ నాటక రంగానికి సేవ చేసి ఋణం తీర్చుకున్నట్టు అయ్యేది.
ఒకపక్క భర్తగా అతను భార్య మాటలకు ఏ మాత్రపు విలువ ఇవ్వనట్టుగా చూపిస్తూనే, మరోపక్క భరించేది భర్త కాబట్టి ఈమె భార్య కాదు, నా భర్త, అని చెప్పించడంలోని ఔచిత్యం ఏమిటో? భార్యను గౌరవంగా రాజుగారు అని పిలిచే అతను ఆమె అభిప్రాయలను ఎంత మాత్రం గౌరవించకపోవడం అతనిలోని ఒక పెద్ద స్వభావ హీనత. ఆమె తనకు కావలసినది వివరంగా చెప్పినా చెయ్యకపోవడం అతనిలోని భర్త తాలూకు నిరంకుశపు ధోరణిని సూచిస్తోంది. జీవితాంతం తోడుగా ఉన్న భార్యకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించకపోవడం శోచనీయం. కూతురిపైన అతనికి కల అవ్యాజమైన ప్రేమ, కోడల్ని అపార్థం చేసుకోని మంచి మామతనం భార్యా విషయంలో ఏమైంది? ఎక్కడా పిల్లలు తమ తండ్రిని ఆస్తికోసం అడగలేదు. అతనే తనంతట తానే ఇచ్చాడు. భార్యను సంప్రదించకుండానే పిల్లలకి ఆస్తిని అంతా ఇచ్చేసి వాళ్ళు వద్దనుకున్నావాళ్ళ దగ్గరే ఉంటూ భార్యని బాధపెట్టి, తాను బాధపడి చివరకు భార్యను చంపుకుని ఎవరు లేని వాడిలా నిస్సహాయంగా ఉండిపోవడం అతని పాత్రకు మచ్చే. అతను అంత దీనావస్థలో ఉండే అవసరం లేదు. ఇది అతని స్వయంకృతాపరాధమే.
రమ్యకృష్ణ చాలాచోట్ల వ్యక్తిత్వం లేని భార్యగా కనిపించింది. తన అభిప్రాయాలను కూతురితోనే, కోడలితోను చెప్పినంత గట్టిగా భర్తతో చెప్పలేదు. ఆ అవకాశం లేకనా లేదా భర్తతో మనసులో మాట చెప్పలేని ఆశక్తతా? నిరాసక్తతా? కోడలులో ఉన్న స్వాభిమానత అత్తగారిలో కరువైంది. ఈ తరంకి చెందిన కోడలు, కూతురు ఆలోచనలను అర్థం చేసుకోలేక వారిని స్వార్థపరులుగా భావించింది. ఆమెలోని నటిని ఎలివేట్ చేసే సీన్ కూతురు ఇంటినుంచి వచ్చేసి చెట్టుకింద తనువు చాలించిన సన్నివేశం మాత్రమే.
పిల్లలను తల్లితండ్రులను నిర్లక్ష్యం చేసేవారిగా అవమానించేవారిలా చూపించడంలో అర్థం లేదు. ఇటువంటి కథలతో లోగడ అనేక సినిమాలు వచ్చాయి. తరాల అంతరాల ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి, ఉంటాయి కూడా. మన ముందు తరం వాళ్ళలా మనం ఉన్నామా ? ఉన్నదంతా ఊడ్చి వాళ్లకి అడక్కుండానే ఇచ్చేసి తరువాత వాళ్ళు మన మాట వినని వాళ్ళగా, విల్లన్లుగా చూపించడం అంత కరెక్ట్ కాదు. ఇది మన పెంపకానికే చెడ్డ పేరు తెస్తుంది. మంచి చెడు రెండు వైపులా ఉంటాయి. వాళ్ళు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జీవిచాలనుకోవడంలో తప్పేమీ ఉంది? మనం గీసుకున్న బరిలోనే వాళ్ళూ ఉండాలని అంటే ఎలా ?
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందంల స్నేహం ఎంతో గాఢమైనది కదా మరి బ్రహ్మానందం భార్య చనిపోతే, అతను ఎవరు లేరని వాపోతుంటే, నేనున్నాని భరోసా ఎందుకు కల్పించలేకపోయాడు? తనకి తల మీద నీడ కరువైనప్పుడు ఒక్కసారైనా బ్రహ్మానందం పరిస్థితి గుర్తుకు రాలేదా? కేవలం తాగుడికి, గతస్మృతులను నెమరువేసుకోవడానికి అతను తోడు అయ్యాడా? తనకు చేతనైన సాయం ఆర్ధికంగా చేసిన మాట నిజమే కానీ అంతకు మించి చేయవలసిన బాధ్యత అతనికి లేదా? అతనికి చావును ప్రసాదించడం ద్వారా తన స్నేహధర్మాన్ని పాటించినట్టా? మెర్సీ కిల్లింగ్ కి వత్తాసు పలికినట్టా ? పైగా మెర్సీ కిల్లింగ్ తప్పు కాదు అన్న రాంగ్ సిగ్నల్ను ఇచ్చినట్టు కాదా? అంతకన్నా తన భార్యతోను మిత్రుడితోనూ కలసి స్వంతవూరు వెళ్లినట్టు చూపిస్తే ఆ పాత్రకు కొంత ఉదాత్తతను కల్పించినట్టయ్యేది.
ప్రకాష్ రాజ్ నటన గురించి పెద్దగా చెప్పే పని లేదు. ఏ పాత్రనిచ్చినా దానికి సంపూర్ణంగా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ సినిమా లో ఉన్న ఒకేఒక్క ప్లస్ పాయింట్ ఏమిటంటే బ్రహ్మానందం నటన. ఆయనను వెకిలినవ్వులు, కుళ్ళు జోకులు, ద్వందార్థపు మాటలకు వాడుకున్నవాళ్లంతా సిగ్గుతో తల వంచుకునేలా త్రివిక్రముడిలా తన నటనాపటిమను చూపించి కంట తడి పెట్టించారు. ఆయనలోని ఒక నిజమైన తాత్వికుడిని మనకు పరిచయం చేసి మనలను విభ్రమకు గురి చేశారు.
చివరిగా నాకు అనిపించింది ఏమిటంటే ఒక ఉద్యోగి పదవి విరమణ తరువాత ఎంత జాగ్రత్తగా ఉండాలనే అన్న సందేశమే ఈ చిత్రంలో ఒక నటుడు రూపేణా ఎక్కువగా ఇచ్చినట్టుగా. ఒక ఆత్మబంధువు, బడిపంతులు, బాగ్బెన్ వంటి చిత్రాలు ఎన్నో ఇటువంటి సందేశాన్ని ఇంకా ప్రభావితంగా చూపించాయి. నాటకరంగ పునర్జీవనానికి తన వంతుగా ప్రకాష్ రాజ్ కనుక ఏదైనా చేసినట్టుగా చిత్రించివుంటే అప్పుడు రంగ మార్తాండ అన్న టైటిల్ సార్థకం అయ్యేది కదా అని.
Comments