రా రా పెనిమిటి
- Balatripura Sundari Venugopal

- Aug 18, 2023
- 2 min read
తెలుగు సాహిత్యంలో ప్రబంధ రచన శృంగారరస ప్రధానమైన ఒక విశిష్ట ప్రక్రియ. ప్రబంధాలలో అష్టవిధ నాయికలకు పెద్ద పీట వేసినవారు తెలుగు ప్రబంధ కవులు. శృంగార రస ప్రధానంగా నర్తించేందుకు వీలుగా ఉన్న ఎనిమిది నాయికావస్థలను కలబోసిన ఒక యోచనే అష్టవిధ నాయికలు. ఇది ప్రణయ విరహది సమయాలలో వారి వారి అనుభూతులు, భావాలను బట్టి ఏర్పడే తాత్కాలిక దశా విశేషాలను అభివ్యక్తీకరించేదే తప్ప వారి స్వభావాల సూచీ కాదు. ఈ అష్టవిధ నాయికలు అనే పదాన్నితొలుతగా తన నాట్య శాస్త్రంలో ఉపయోగించింది, వివరించింది భరతుడు.
కొత్తగా పెళ్లయి ఆ దాంపత్యపు జీవిత మధురిమల తీపి ఇంకా పూర్తిగా అనుభవంలోకి రాకముందే నాయకుడు ఉద్యోగ నిమిత్తమో, పై చదువుల నిమిత్తమో విదేశానికి వెళ్ళవలసి వచ్చినందున నాయికా నాయకులకు ఎడబాటు కలుగుతుంది. ఆ విరహపు బాధను తట్టుకోలేక నాయిక పడే యాతనను, అతని ఆగమన వార్తను విని ఉబ్బితబ్బిబైన ఆమె ప్రవర్తనను అష్టవిధ నాయికా అవస్థల ద్వారా ఆవిష్కరించిన అందమైన కదంబమాల ఈ సినిమా. ఆమె దేశాంతరంలో ఉన్న తన పెనిమిటి కోసం తపించిపోతున్నవేళ ప్రోషితభర్తృక
ఆమె భర్త వస్తున్నాడనే వార్త విని సంతోషంతో శయ్యాగృహాన్ని అలంకరించేవేళ వాసవసజ్జిక
ఆమె భర్త స్నేహితురాలి ఫోన్ ద్వారా అతని సమాచారాన్ని తెలుసుకున్నప్పుడు అనుమానంతో అతనిని అనుమానించి బాధపడే వేళ కలహాంతరిత / ఖండిత
ఆమె అందంగా ముస్తాబై అతనిని ఇంటికి తీసుకురావడానికి వెళ్లే వేళ అభిసారిక
ఆమె తన స్వాధీనములో ఉండి తాను ఎలా చెపితే అలా భర్త నడిచే వేళ స్వాధీనపతిక
ఆమె నది వొడ్డున అతను కనపడక విలవిలలాడే వేళ విరహోత్కంఠిత / విప్రలబ్ద
కొన్ని సమయాలలో ముగ్ధగా, మరికొన్ని సందర్భాలలో గడుసుగా, ఇంకొన్ని చోట్ల బేలగా, ముక్కుమీదే కోపం ఉన్న గారాల చిన్నకూతురిగా, నందిని నటన చాలా సహజంగా ఉంది. పల్లెటూళ్లలో కనిపించే కపటం లేని ఆప్యాయతలు, ఒకరికి ఒకరు సాయంగా ఉండే నైజం, ఇతరుల విషయాలపట్ల ఉండే ఆసక్తిని కేవలం మాటల ద్వారానే చిత్రీకరించిన విధం చాలా బావుంది.
మంచి సాహిత్యకారుడిగా మన్ననలను అందుకుంటున్న నీలకంఠ గారు, మంచిసంగీతానికి కేరాఫ్ అడ్రస్ అయిన మణిశర్మగారు, మంచి అభిరుచి ఉన్న దర్శకుడు ప్రసాద్ గారు కలసి ఒక వినూత్న ప్రయోగంగా చేసిన ఈ చిత్రం తెలుగులో వచ్చిన మంచి చిత్రాల జాబితాలో చోటు చేసుకుంటుంది. మనం ఏ విలువలను ఐతే బలంగా నమ్ముతామో వాటిని అలాగే నిలుపుకు రావడమనేది చాలా గొప్ప విషయం. ఈ సినిమా చిత్ర దర్శకులు శ్రీ ప్రసాద్ చేసింది అదే. విధివశాత్తు తమకు దూరమైన కన్నబిడ్డను మర్చిపోలేక, అతని జ్ఞాపకాలను ఫొటోస్ ద్వారా ఈ చిత్రంలో నాయక పాత్రధారిగా పరిచయం చేసి, అతనిపైన తమకు కల ప్రేమను ఈ చిత్రం ద్వారా ఒక దృశ్యకావ్యంగా మలచేరు. ఎటువంటి అసభ్యతకు తావీయకుండా, అశ్లీలతను ఆమడ దూరానపెట్టి ఒకే ఒక్క పాత్రతో ఆయన చేసిన ఈ ప్రయోగం తెలుగు సినిమా రంగాన ఒక కొత్త మలుపుకి పునాది వేసింది.
భాషపరంగా, కాన్సెప్ట్ పరంగా ఈ చిత్రం ఈ నాటి యువతకు సులువుగా కనెక్ట్ కావడం కొంచం కష్టమే. సినిమా ఆరంభంలో అష్టవిధ నాయికల గురించి కొంత వివరణను తేలికగా అర్థమయ్యేట్టు చెప్పివుంటే అది సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అయ్యేది.
మూస ధోరణిలో సాగుతున్న తెలుగు సినిమాకు ఇటువంటి కొత్త ఆలోచనలు కావాలి. అటువంటి ఆలోచనలను తీసే మనో నిబ్బరం సాహసం ఉండాలి. అటువంటివి పుష్కలంగా ఉన్న ప్రసాద్ గారి దర్శకత్వంలో మరిన్ని న్యూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు రావాలని ఆశిద్దాము.
xxxxxxxxxxxx
Comments