శ్రీరమణ
- Balatripura Sundari Venugopal
- Sep 26, 2023
- 2 min read
చాలా రోజులు దాకా నేను అసలు శ్రీరమణ అంటే ముళ్ళపూడి వెంకటరమణ గారే అనుకునేదాన్ని. ఆయన తనకి తానే శ్రీ అని రాసేసుకుంటున్నారేమిటి చెప్మా అని బుడుగు భాషలో బోలెడు కుంచెము హాశ్చర్యపడేసాను. కాని బాపురమణీయము చదివిన తరువాత ఆయన ఆయనే, ఈయన ఈయనే అని గ్రహించేసుకుని, బాపు రమణలు అంటే నాకు మాటలలో చెప్పలేనంత భక్తి, ఆరాధన కాబట్టి వాళ్ళు ఇష్టపడ్డ ఈయనను నా అభిమాన రచయితల కూటమిలో చేర్చేసాను.
శ్రీరమణ గారి రచనలు రవ్వంత హాస్యం, చిటికెడు వ్యంగ్యం, గోరంత లోకరీతి, కాస్తంత అతిశయోక్తులు కలిపి వడ్డించిన విస్తర్లు. ఆయన పేరడీలు చదివి జలసూత్రము వారి తర్వాత మళ్ళీ ఈ ప్రక్రియను ఈయన భలే సాధించారని సంబరపడ్డాను. వివిధ పత్రికలలో ఆయన నిర్వహించిన శ్రీఛానెల్, రంగులరాట్నం శ్రీకాలమ్, మొగలిరేకులు, హాస్యజ్యోతి, మొదటి పేజీ, అక్షరతూణీరం వంటి శీర్షికలు, కాలమ్స్ చదవడము ద్వారా ఆయన కలములో వాడి, వడి ఆకళింపుకు వచ్చాయి. తెలుగు నుడికారపు పట్టు, గుట్టు, గట్టిగా పట్టుకున్న ఆయన భాష అంటే తగని మక్కువ పుట్టింది.
మనకు మన ఊరు, చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికీ తరిగిపోని ప్రేరణా, పెన్నిధీ కూడా. అప్పటి మన అనుభవాలను గిలుక్కోవడం తప్ప కుదుమట్టంగా రాయడం రాని మనకు శ్రీరమణ రాసిన చాలా కథలు మనకోసము మనమే చెప్పుకున్నట్టుగాను రాశారు కదా అని అనిపిస్తుంది. అప్పటి వాతావరణము, బతుకులు, అటువంటి మనసున్న మారాజులు, మారాణులు ఇప్పుడు కలికానికైనా కానరానందున వాటిని, వారిని తన రాతల ద్వారా గుర్తుచేసి ఆయన మనకి గొప్ప సాయము చేశారు. ఆ ’తలపోతల్ని’ మనతో తనివితీరా కలబోసుకుని, అవే ప్రవృత్తిగా, వృత్తిగా, తన జీవితాన్ని మలచుకుని ఆయన తన రచనా వ్యవసాయాన్ని సాగిస్తుంటే, ఆయన మనలో ఒకడే అనే దగ్గరితనపు భావన. వాటి రుచిని నెమరేసుకుంటుంటే శ్రీశ్రీ ఖడ్గసృష్టిలో
పసిడిరెక్కలు విసిరి కాలం
పారిపోయిన జాడలేవీ?
ఏవి తల్లీ: నిరుడు కురిసిన
హిమ సమూహములు?
అని వాపోయినట్టుగా మనసు చెమ్మగిల్లి మసకబారుతుంది.
ఆయన కథలలో మనసుకు హత్తుకునే రచనా శైలి, సున్నితమైన వ్యంగ్యం, సునిశితమైన హాస్యం, ఏకబిగిని చదివించే గుణం, హృద్యమైన పాత్రల సన్నివేశాల చిత్రీకరణ వలన మామూలు కథలే మామంచి కథలై మనకు ఒక చక్కని మంచి అనుభవాన్ని కలిగిస్తాయి. ఆయన కథలు వేటికవే ఆణిముత్యాలు. ఎన్నికగా చెప్పడానికి నాకు తాహతు లేదు, అర్హత అంతకన్నా లేదు.
శ్రీరమణ విరచిత మానవ సంబంధాలలో ఆలుమగల బంధము అన్నిటిని తలదన్నేటట్టుగా మిథునం రూపంలో మనకు సాక్షత్కారిస్తుంది. అడవిలోని ఉసిరికాయ, సముద్రపు ఉప్పు కలసిన తీరున ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన అమ్మాయి అబ్బాయి వివాహాబంధముతో తమ అస్తిత్వాలను మరచిపోయి కట్టుబాట్లు, సద్దుబాట్లు, దిద్దుబాట్ల మధ్య ఆలుమగలుగా అద్వైతులవుతారు. వసంత ఋతువులా ఆరంభమయ్యే వారి సంసారపు తొలి మజిలీ సాగుతూ సాగుతూ శిశిర ఋతువులాంటి మలి మజిలీని చేరేనాటికి, వారిద్దరు మానసికంగా పరిణితి చెంది, ఒకరిని ఒకరు సరిగా అర్ధము చేసుకుని, తమ మధ్య దృఢమైన మానసిక దగ్గరితనాన్ని పంచుకోవాలి, పెంచుకోవాలి. అలా పెంచుకుంటేనే వారి దాంపత్యము పండుతుంది అన్న చిదంబర రహస్యాన్ని తేలికగా తేల్చి చెప్పారు సుమారు పాతికేళ్ల కిందటే శ్రీరమణ తన మిథునం అనే కథ ద్వారా.
పెళ్లి పుస్తకం నాందిగా మొదలయ్యే దాంపత్యపు అర్థ సాగరాన్ని మథించి మిథునము అనే అమృతపు కథాపాత్రను మనకు అందించి చరితార్థులను చేసేసారు. బుచ్చిలక్ష్మి అప్పదాసు మన ఇంటి సభ్యులైపోయి, మన మనస్సులో తిష్ఠవేసుకుని కూర్చున్నారు. చిలిపి చిలిపి తగాదాల మాటున ఒకరిపట్ల ఒకరికున్న తపన, తరగని ప్రేమతో మనము కూడా ఇలా ఉంటే బావుంటుంది అన్న ప్రలోభాన్ని కలిగించడములో పూర్తిగా కృతకృత్యులయ్యారు ఆ ఆలుమగలు. బహుశా మనలో చాలామందిమి వైవాహిక జీవితపు మలిసంధ్యలో ఉన్నందున, అప్పదాసు బుచ్చిలక్ష్మి ఛాయలు మనలో తొంగి చూస్తున్నందున, మిథునం కథకు వీరాభిమానులైనామని అని నాకు అనిపిస్తోంది.
ఈ రచయితలు, చిత్రకారులు గాయకులు, భలే స్వార్థపరులండి. వాళ్ళ కళా వైదుష్యపు మృష్టాన్నపు షడ్రుచులను మనకు అలవాటు చేసి వాటిని మనసుకు తుష్టిని కలిగించేలా ఆస్వాదించే లోపునే హాడావుడిపడి అర్థాకలితో మనలను వదిలేసి పైలోకాలలో ఉన్నవారిని తరింపచేయడానికి వెళ్ళిపోతారు. కాని తెలుగు భాష, తెలుగు నుడికారపు, సొగసు తెలుగువారి బతుకులు తెల్లారిపోకుండా ఉండాలంటే ఇటువంటి రచయిత మళ్ళీ మన మధ్యనే పుట్టాలి అని మాత్రం గట్టిగా చెప్పగలను.
Comentários