top of page
Search

సంబరాల సంక్రాంతి

  • Writer: Balatripura Sundari Venugopal
    Balatripura Sundari Venugopal
  • Jan 21, 2021
  • 2 min read

నిరుపమలీల బాలికలు నిశ్చలభక్తిని యుక్తిసంకురా

తిరినెల( బేడగొబ్బిలులు దీర్తురు వాకిళులందు మ్రుగ్గులన్

బొరిబొరి బొమ్మల న్నిలిపి పూజలు సేతురు బొమ్మరిండ్లలో

బరువడి నార(గించెదరు పచ్చడిబెల్లము పుల్గ మిచ్చలన్.

సంక్రాంతి అంటే సంతోషాల సంరంభం, ప్రకృతి శక్తుల ప్రణవరావం. ఆకుపచ్చటి చీరను వంటికి చుట్టుకుని బంతిపూలదండలను, చేమంతులమాలలను జడనిండా తురుముకుని రంగురంగుల రంగవల్లుల మెలికలలో నయగారాలు పోతూ నడచి వచ్చే సోయగాల సంక్రాంతి పండుగ అచ్చంగా ఆడపిల్లల పండుగ. గొబ్బెమ్మలు, ముగ్గులు, పూలజడలు భోగిపళ్ళ పేరంటాలు, బొమ్మలకొలువులు ఇలా సంక్రాంతి సంబరం అంతా మన తెలుగింటి అమ్మాయిలదే.

ధనుర్మాసం మొదలైననాటి నుంచి మాహడావుడికి అంతే ఉండేది కాదు. ఆ నెలరోజులూ తెల్లవారగట్ల మా జగన్నాథపురం వెంకటరమణ మూర్తి గుడి నుంచి వినిపించే “మేలుకో శ్రీ రామ”, “నా దేహమే నీ దేవళం”, “ఏమయ్యా వో రామయ్య నిన్నెట్టా కొలిచేది” పాటల తోనే మాకు మేలుకొలుపులు. ఆవుపేడతో పిడకలు వేసి వాటి పద్దుని రోజూ లెక్కపెట్టుకుని పంపకాలు చేసుకునేవాళ్ళము, పెద్ద ఆస్తిపాస్తులలా. ఎవరి దండ పెద్దదో కొలుచుకోవడము, ఉడుక్కోవడము. ఇహ తర్వాత ముగ్గుల గురించిన శిఖరాగ్ర చర్చలు,కొత్త కొత్త ముగ్గులు నేర్చుకోవడం, మెలికల ముగ్గులు రాకపోతే ఇంట్లోవాళ్ళ ప్రాణాలు తీయడం, నోట్ పుస్తకాల నిండా చుక్కలు, సగం సగం గీసిన ముగ్గులు, అవి చూసిన అమ్మవాళ్ళ చేత చీవాట్లు తినడం.

మా పనిపిల్ల సాయంకాలం అయ్యేసరికి ఇంటి ముందు ఆవుపేడతో కలాపి జల్లి శుభ్రం చేసేది. తొందరతొందరగా అన్నాలు తినేసి పిన్ని, నేను ముగ్గుబుట్టలతో కొలువుతీరేవాళ్ళం. పిన్ని ఎంతో శ్రద్ధతో, వోపికగా, పోతపోసినట్టు ముగ్గుల్ని పెట్టేది. ఇహ నేనో ఎలాటి ముగ్గునయినా, మెలికలవి తప్పించి, పట్టుదలగా నేర్చేసుకునేదాన్ని, పిన్నికి సూచనలు ఇచ్చేదాన్ని. కానీ తీరా ముగ్గు పిండి తీసుకుని పెట్టేటప్పటికి వన్నెలుచిన్నెలుతో పిన్ని ముగ్గులు ముందు చిన్నపోయేవి నా ముగ్గులు. లాభం లేదని దర్శకత్వ బాధ్యత వహించి వేయడం మానేశాను. పులవర్తి రమణమ్మ, చిన్నా, సుబ్బన్న గారి భాస్కరం అక్క, నల్లాయనగారి బంగారు తల్లి, గుడిమెట్ల వారు, మేము ముగ్గులు పోటీలు పడి వీధి అంతా పెట్టడం, చుట్టుపక్కల వాళ్లకన్న గొప్పగా ముగ్గులు పెట్టేయాలన్న అహమిక, ఎవరయినా వాళ్ళ ముగ్గులు బావున్నాయని అంటే చిన్నపుచ్చుకోవడం, ముగ్గుల పుస్తకాలు దాచేసుకోవడం, అబ్బో అరిషడ్వర్గాలు ఆ నెలరోజులూ మా నేస్తులు. ఎవరయినా స్కూటర్ మీద కానీ, సైకిల్ మీద కానీ పొరపాటున మా ముగ్గుల మీద నుంచి వెడితే వాళ్ళకు అష్టోత్తరం, సహస్రం అయిపోయేవి. వాళ్ళు మళ్ళీ మా వీధిలోకి వస్తే వొట్టు.

భోగి పండుగకి ఒకటి రెండు రోజుల ముందే ధాన్యంబళ్ళు చెరుకు గడలు, తేగలు, చెరుకు ఆడించి చేసిన బెల్లం పాకం, అరటి గెలలతో మునిమాపు వేళ వచ్చేవి. ఇహ మా పిల్ల గ్యాంగ్ అంతా ఆ బళ్లు ఎక్కి మల్లీశ్వరి సినిమాలో “పరుగులు తియ్యలి, వూరు చేరాలి” ఉండమ్మా బొట్టు పెడతా సినిమాలో “రావమ్మా మహాలక్ష్మి రావమ్మా” నమ్మినబంటు సినిమాలో “చెంగుచెంగున గంతులు వేయాలి”, మాతా అన్నపూర్ణేశ్వరి అని అన్నపూర్ణ కావిడి సాధువు పాడే పాట (పూర్తిగా వచ్చేది కాదు), ఇంకా ఏవేవో పాడేసుకునేవాళ్ళము. ఆ బళ్ళు మా ముగ్గులు తొక్కకుండా చూడ్డం పెద్ద యజ్ఞం. ఆ ఎడ్లను చూసి పొంగిపోయి వాటిని ముట్టుకోవడానికి భయం, మళ్ళీ కోరిక, అందుకని బళ్లవాళ్ళని తొణకనిచ్చేవాళ్ళం కాదు. ఆ బళ్లు ఎక్కి గడ్డి గుచ్చుకుని వొళ్లంతా దురదలు పెడుతుంటే సరదా తీరిపోయేది. బళ్లవాళ్ళ కోసమని ఉలవల చారు లేకపోతే చిన్నఉల్లిపాయలు వేసి పప్పుపులుసు పెట్టేవారు. ఎంతో రుచిగా వుండేవి.

భోగినాడు తెల్లారకుండానే లేచి చలికి వణుకుతూ భోగిదండలు పుచ్చుకుని సందుచివర రాజేసిన భోగిమంటల్లో వేసేవాళ్లము. తర్వాత ఆ నుసిని కొంచం బొట్టులా పెట్టుకునేవాళ్ళము దృష్టిదోషాలు పోవడానికి. నువ్వులనూనెతో తలంట్లు, ఆపైన అమ్మమ్మ చేసిన చక్రపొంగలి తినేసి గుళ్లోకి కొత్త బట్టలతో వెళ్ళేవాళ్ళము. ఆ పండుగ సమయంలోనే ఆరేడు జతలు కుట్టించేసేవారు. యించుమించు దసరా పండుగ వరకు కొత్త బట్టలు కొనేవారుకారు, ఒక్క పుట్టినరోజుకి తప్ప. ఇంట్లో అందరికీ ఒకే డిజైన్ బట్టలు కొనడంతో నాతో ప్రతీసారి మాఅమ్మకు పెద్ద తలనొప్పి. బాండ్ మేళం వాళ్ళలా ఉంటామని వేసుకోడానికి తెగ పేచీ పెట్టేదాన్ని. అమ్మమ్మ సముదాయించి నన్ను వేరే రంగువి కానీ, డిజైన్వి కానీ వేసుకునేలా చూసేది. గొబ్బెమ్మలు మేము పెట్టడం తక్కువే. కానీ గొబ్బె పేరంటాలకు వెళ్ళేదాన్ని. “గొబ్బి తట్టుదాము రారే”, “గొబ్బియళ్ళో, గొబ్బియళ్ళో రాజావారి తోటలో జామ కాసింది, ఔనాట భామల్లరా, చంద్రగిరి అక్కల్లారా”, “చందమామ చందమామ చందమామకు పిల్లలెందరు” అని గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాడేవాళ్ళము.

భోగి పండుగ నాడు చక్రపొంగలి, సంక్రాంతి నాడు పులిహోర, బొబ్బట్లు, కనుమ నాడు గారెలు ఆవడలు, పరమాన్నం, ముక్కనుమ నాడు సగ్గుబియ్యం సేమ్యాలతో పరమాన్నం చేసేవారు. పండుగకు నాలుగు రోజుల ముందే ముగ్గురమ్మమ్మలు కలిసి బెల్లం మిఠాయి, జంతికలు చేసేవారు. అన్నీ మూసలో పోసినట్టుగా ఒకే సైజ్ లో గుండ్రంగా ఉండేవి. వాటిని చూస్తేనే కడుపు నిండిపోయేది. వాటిని రెండు కుంచాల డబ్బాలో దాచేవారు. ఇంటికి వచ్చినవాళ్ళకి పెడుతున్నా, వూళ్ళో ఉన్న చుట్టాలకు పంపుతున్నా, మాకు ఒకటే ఆదుర్దా అవి అయిపోతయేమో అని. రోజూ సాయకాలం నాలుగు గంటలకు పెట్టేది అమ్మమ్మ. ఆ రుచీ లేదు, ఆ ఆప్యాయతా రాదు మళ్ళీ.

 
 
 

Recent Posts

See All
శ్రీశ్రీ

శ్రీశ్రీ చదువుకునే రోజుల్లో నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన ఆ మహానుభావుడి మీద భక్తితో, గౌరవంతో సమర్పిస్తున్న చిన్న నివాళి ఇది. "మింటనెచటనో...

 
 
 
విశ్వనాథ సాహిత్య దర్శనము

మనము చదివే కొన్ని రచనలకు వయసుతో పాటుగా వచ్చే పరిణితి, జీవితానుభావాలు, నిశితమవుతున్న అవగాహన, పెరుగుతున్న లోక జ్ఞానం మొదలైనవి ఏదో ఒక...

 
 
 

Comments


Post: Blog2_Post
  • Facebook
  • Twitter
  • LinkedIn

©2020 by nenu meeru. Proudly created with Wix.com

bottom of page